తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ జాతీయ రాజకీయాలపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. ఢిల్లీ వెళ్తాననీ, భావసారూప్యత గల రాజకీయ పార్టీలతో ఒక కామన్ అజెండా తయారు చేస్తాననీ, లోక్ సభ ఎన్నికల్లో అదే అజెండాతో కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంట్ ముందుకొస్తుందన్నారు. ఆ దిశగా కొంత ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని, ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్ ని, ఢిల్లీకి వెళ్లి మరికొంతమంది జాతీయ నేతల్ని కలిసే ప్రయత్నం చేశారు. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో… ఫ్రెంట్ ప్రయత్నాల్ని కేసీఆర్ కాస్త పక్కనపెట్టినట్టుగా కనిపిస్తోంది.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన దగ్గర్నుంచీ జాతీయ రాజకీయాల్లో చకచకా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్యంగా క్రియాశీలంగా కనిపిస్తున్నారు. ఇంకోపక్క, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్… వీరంతా మోడీ సర్కారుకి వ్యతిరేకంగా నిరసన గళాన్ని తీవ్రంగానే వినిపిస్తున్నారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా లాంటి నాయకులు కూడా భాజపాయేతర కూటమివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వీరికి మద్దతుగా వస్తోంది. భాజపాయేతరం, కాంగ్రెసేతరం అనే కేసీఆర్ మూల సిద్ధాంతం వర్కౌట్ కాదనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తన ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నాల్ని కేసీఆర్ తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు చెప్పొచ్చు.
అయితే, కేసీఆర్ ధీమా మరోలా ఉందనీ చెప్పొచ్చు! ముందుగా లోక్ సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు దక్కించుకోవడంపై దృష్టి పెడితే… ఎన్నికల తరువాత ఢిల్లీలో క్రియాశీలంగా వ్యవహరించగలిగే స్థాయి వస్తుందనేది ఆయన వ్యూహంగా కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రెంట్ పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాయకుల్ని కలిసినా, ఢిల్లీ వెళ్లి ఎన్ని మీటింగులు పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదనేది స్పష్టం. అందుకే, ఇప్పుడు కేసీఆర్ ఆ కూటమి ఊసెత్తడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు ఉండవనే అనిపిస్తోంది. అయితే, ఎన్నికలలోపుగానే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదికి వచ్చేస్తే… ఎన్నికల తరువాత కేసీఆర్ నాయకత్వంలో జట్టు కడదామన్నా మిగిలే పార్టీలు ఎన్ని ఉంటాయి..? ఉంటే గింటే… ఏపీలో వైకాపా తప్ప!