తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కొత్తగా… టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు వెల్లువలా వచ్చి చేరబోతున్నారని కొద్ది రోజులుగా మీడియా ప్రచారం చేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో పన్నెండు మంది, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిదీ అదే దారి అని.. చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ దూకుడు చూస్తూంటే … అది నిజమేనేమో అన్న భావన కల్పించారు. నిజానికి అది మైండ్ గేమ్ అని.. ఇప్పుడిప్పుడే తేలిపోతోంది. టీఆర్ఎస్ అనుకూల మీడియా సాయంతో…. ఎవరెవర్ని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారో ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ… కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి.. ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహిరంచింది. పార్టీ ఫిరాయిస్తే.. ఎవరెవరికి.. ఎలాంటి ప్రయోజనాలను కేసీఆర్ కల్పిస్తారో ఆశ పెడుతూ కథనాలు ప్రచురించింది.
సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి.. ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే… వారిపై నుంచి ఖండనలు వచ్చాయి తప్ప.. ఆ మైండ్ గేమ్ ఫలించలేదు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే.. వారికి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయవచ్చన్న ప్లాన్ కేసీఆర్ అమలు చేయబోతున్నారని చెప్పుకుకున్నారు. ప్రతిపక్షం లేని తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ చూపించబోతున్నారని… టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేశాయి. అయితే.. కారణం ఏదైనా కానీ.. ఈ సారి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ గొప్పగా ఫలించలేదని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా… టీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ముందడుగు పడిన పరిస్థితులు కనిపించడం లేదు. సండ్ర టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది.
కానీ.. 88 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరపున గెలిస్తే… వారిని కాదని వలస ఎమ్మెల్యేలకు ఇస్తే.. చెడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో.. టీఆర్ఎస్ మళ్లీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తానికి.. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. చేరికలు పూర్తి చేయాలనుకున్న కేసీఆర్ కు పరిస్థితులు కలసి రాలేదు.