ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగించడంపై పూర్తి భిన్నంగా మాట్లాడారు. రాష్ట్రం బయట ఉంటూ పరిపాలన కొనసాగించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రాష్ట్ర ప్రజలు కూడా ఆవిధంగా పాలించడాన్ని ఇష్టపడటం లేదని, తమకి కూడా ప్రజలకి దూరంగా ఉండిపోయామనే భావన కలుగుతున్నందునే పదేళ్ళపాటు హైదరాబాద్ నుంచి పరిపాలించుకొనే అవకాశం ఉన్నప్పటికీ విజయవాడ తరలివచ్చేశామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం యావత్తు ఒకేచోట ఉన్నట్లయితే పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుందని, నిర్ణయాలు వేగంగా తీసుకొని అమలుచేయడానికి వీలు పడుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే తాత్కాలిక సచివాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి వీలయినంత త్వరగా ఉద్యోగులను కూడా విజయవాడ రప్పించడానికి ప్రయత్నిస్తునట్లు చెప్పారు.
ఇదే విషయం గురించి కేసీఆర్ అమన్నారంటే “ఓటుకి నోటు కేసు గురించి నేనేమీ మాట్లాడను కానీ ఆ కారణంగానే ఆయన విజయవాడ తరలివెళ్లిపోయారని ఖచ్చితంగా చెప్పగలను. హైదరాబాద్ లో ఆంధ్రా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన, అది సాధ్యం కాదని గ్రహించడంతో విజయవాడ వెళ్లిపోయారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన విజయవాడ వెళ్ళిపోయినప్పటికీ ఆయన పాలనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు,’ అని ఒక మీడియా ప్రతినిధితో అన్నారు.
చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరి మాటలు నిజమేనని చెప్పవచ్చు. ఆ కారణాల వలననే చంద్రబాబు నాయుడు విజయవాడ తరలివచ్చి పాలిస్తున్నారు. చంద్రబాబు పాలన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం ఎన్నికలు వస్తేనే తెలుస్తుంది.