శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారంతా చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం తొమ్మది ఆచూకీ ప్రమాదం జరిగినప్పటి నుండి తెలియడం లేదు. వీరిని రక్షించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్లాంట్ లోపల.. దట్టంగా కమ్ముకున్న పొగలు.. సహాయ కార్యక్రమాలను ముందుకు సాగకుండా చేశాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యాధునిక పరికరాల సాయంతో చేసిన రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు.
ప్రమాదంలో అందరూ చనిపోయినట్లు సమాచారం తెలియగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని … అందరికీ ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కేసీఆర్ మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నుంచి తరచూ వివరాలు తీసుకున్నారు.
మరో వైపు శ్రీశైలం పవర్ ప్లాంటులో ప్రమాదంపై సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారవర్గాలు ఇంత వరకూ క్లారిటీకి రాలేకపోయాయి. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోవడంతో ప్లాంట్‌లో అసలేం జరిగిందో అంచనా వేయడం కష్టంగా మారింది.