ఏపీ సచివాలయ ఉద్యోగులు హాయిగా అమరావతిలో పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. చక్కగా ఉన్న భవనాలను కూల్చి అద్భుతమైన కొత్త భవనాన్ని కట్టించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చకచకా సన్నాహాలు చేస్తోంది. 10 రోజుల్లో సచివాలయ ప్రాంగణంలోని కార్యాలయాలను ఖాళీ చేయాలని సోమవారం నాడు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇంజినీరింగ్ విధులతో కూడిన కొన్ని శాఖల కార్యాలయాలను వాటి ప్రధాన ఆఫీసుల భవనాల్లోకి మారుస్తారట. మిగిలిన వాటిని బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి ఆగమేఘాల మీద ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ ఆఫీసుల తరలింపు పనుల పర్యవేక్షణ బాధ్యతలను 9 మంది అధికారులకు అప్పగించారు. ఏయే శాఖల ఆఫీసులను ఎక్కడికి తరలించాలి, వాటి ఫైళ్లు ఇతరత్రా విషయాలపై వీరు తగిన పర్యవేక్షణ, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
బూర్గుల భవనంలో ఇప్పటికే చాలా ఆఫీసులున్నాయి. సచివాలయంలోని ఇన్ని శాఖల ఉద్యోగులు కూర్చోవడానికి అక్కడ స్థలం ఉందా అనేది అంతుపట్టడం లేదు. అక్కడ అందరికీ వీలుకాకపోతే ఇతర భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఎలాగూ సచివాలయానికి వెళ్లడం అనేది పట్టించుకోరు. నెలకు ఒకటిరెండు సార్లు వెళ్లడం కూడా అరుదే. కాబట్టి సీఎంవోను కొత్తగా నిర్మించిన ఆధునిక క్యాంప్ ఆఫీసుకు తరలించాలని నిర్ణయించారు. అంతవరకూ ఇబ్బంది లేదు. మిగతా కార్యాలయాల విషయమే సందిగ్ధంగా ఉంది.
మొత్తానికి 10 రోజుల తర్వాత హైదరాబాదులోని సెక్రటేరియట్ బోసి పోయి కనిపిస్తుంది. పేరుకే సెక్రటేరియట్. రెండు రాష్ట్రాల ఆఫీసులూ తరలిపోయిన తర్వాత కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రం కనిపిస్తారేమో. ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించేలా చూడాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. ఏపీ ప్రభుత్వం కూడా ఓకే అంటుందనే నమ్మకంతో కొత్త భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నాయి.