తెలంగాణలో గొప్ప వ్యవసాయ విధానాలున్నాయని.. రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని దేశం మొత్తం తెలిసేలా చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భిన్నమైన మార్గాన్నిఎంచుకున్నారు. రైతు సంఘాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా మంది రైతుల్ని పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జరుగుతోంది ఏమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోందని అహో.. ఓహో అని పొగడటం.
కేసీఆర్‌కి ఎవరితోనైనా పని పడితే వారిని ప్రగతి భవన్‌కు సాదరంగా ఆహ్వానిస్తారు. అద్భుతమైన ఆతిధ్యం ఇస్తారు. కలిసి భోజనం చేస్తారు. కొసరి కొసరి వడ్డిస్తారు. మూడు, నాలుగేళ్లపాటు అసలు ప్రగతి భవన్‌లోకే అడుగు పెట్టని కమ్యూనిస్టులకు ఇటీవల అక్కడ విందు భేటీలు జరిగాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండల్లికీ అలాంటి ఆతిధ్యం లభించింది. వీరే కాదు చాలా మందికి అలాంటి ఆతిధ్యం లభించింది. కాకపోతే వాళ్లందరికీ కేసీఆర్‌తో పని పడాలి. కనీసం కేసీఆర్‌కు ఆ సమావేశాలు ఉపయోగపడాలి.
ఇప్పుడు ఉత్తరాది రైతు సంఘాల నేతలతోన కేసీఆర్‌కు చాలా పని పడింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి వీరంతా బ్రాండ్ అంబాసిడర్లులాగా ప్రచారం చేయాలి. అందుకే సాదరంగా ఆహ్వానించారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని వారు భోజనం తర్వాత హామీ ఇచ్చారు. అంటే కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్లే అనుకోవాలి.