ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజకీయంగా తాడో పేడో తేల్చుకుంటున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పాటించడానికి సిద్ధంగా లేరు. అయితే కొన్ని చేయక తప్పదు. అలా చేయాల్సి వచ్చినవి సొంత ముద్రతో చేస్తున్నారు. తాజాగా మోదీ ” అజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో వేడుకలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కానీ కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కేంద్రంతో సంబంధం లేకుండా.. కొత్తగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు.
దీనిపై కేసీఆర్ సమీక్ష చేశారు. ఇంకా మోదీ డీపీ విధానానికి కూడా కౌంటర్ ఇస్తున్నారు. అందరూ సోషల్ మీడియా డీపీలుగా జాతీయ జెండా పెట్టుకోవాలని మోదీ పిలుపనిచ్చారు. దీనికి కౌౌంటర్గా ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ చిహ్నంలోని అశోకచక్రం, రాష్ట్ర అధికారచిహ్నంలోని కాకతీయతోరణం, త్రివర్ణపతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. నెలాఖరు వరకూ దీన్నే వాడాలని ప్రభుత్వం సూచించనుంది.
అన్ని రాష్ట్రాలు అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతోనే నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ సర్కార్ పేరు మార్చి కేంద్రం ఊసు లేకుండా సొంతంగా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ఓ లోగో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించడం.. దాన్నే సోషల్ మీడియా డీపీలుగా పెట్టుకోవాలని సూచించే చాన్స్ ఉండటంతో కేంద్రానికి పోటీగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాల్లోనూరాజకీయం చేస్తారా అనే విమర్శలకు.. అసలు మోదీనే రాజకీయం చేస్తున్నారనే కౌంటర్ టీఆర్ఎస్ దగ్గర రెడీగా ఉంటుంది. అందులో సందేహం ఉండదు.