హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోకూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అయితే కమ్యూనిస్టులు అక్కడవాటిగురించి ఆందోళన చేయటంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారంనుంచి ప్రారంభంకానున్న శాసనసభా సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, ఆశా వర్కర్ల ఆందోళనలు కమ్యూనిస్టులకు పట్టవా అని కేసీఆర్ అన్నారు. సాగర్‌నుంచి రెండోపంటకు నీరు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు.
ప్రతిపక్షాలు పారిపోయేంతవరకు సభ నిర్వహిద్దామని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు సూచించారు. సమావేశాలకు టీఆర్ఎస్ సభ్యులు నూరు శాతం హాజరవ్వాలని, ప్రతి సభ్యుడూ అంశాలవారీగా పూర్తివివరాలతో సభకు రావాలని చెప్పారు. అన్ని అంశాలపై చర్చించేవరకు సభను నిర్వహిద్దామని అన్నారు. 84 మార్కెట్ కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యలు అనే మహా సంక్షోభం పరిష్కారానికి చర్యలు తీసుకోవటం పక్కన పెట్టి ఇంకా సీమాంధ్ర జపం చేయటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆత్మహత్యలను సీమాంధ్ర మీడియా హైలైట్ చేస్తోందనటం, కమ్యూనిస్టులు అక్కడెందుకు ఆందోళన చేయటంలేదనటం సమస్య పరిష్కారానికి మీకు లేని నిబద్ధతను, సంకల్పాన్ని ఎత్తిచూపుతున్నాయని ఇప్పటికైనా తెలుసుకోండి ముఖ్యమంత్రిగారూ!