తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనని తాను నరేంద్ర మోడీకి సరిసమానం అన్నట్టుగా ప్రతిక్షేపించుకుంటున్నారు..! కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసి.. దానికి తానే నాయకత్వం వహిస్తానని చెప్పుకొస్తున్న కేసీఆర్… ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయం కూడా తానే అనేట్టుగా మాట్లాడుతున్నారు. మోడీ బాటలోనే తాను కూడా ఢిల్లీకి వెళ్తా అంటున్నారు. నేరుగా చెప్పకపోయినా… తనలోని ‘ప్రధానమంత్రి’ ఆశల్ని అన్యాపదేశంగా కేసీఆర్ బయటపెట్టేస్తున్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస శాసన సభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గుజరాత్ ను అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీ, ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి అయ్యారన్నారు. తెలంగాణను గడచిన మూడున్నరేళ్లలో అభివృద్ధి చేశాననీ, మోడీ మాదిరిగానే ఢిల్లీ వెళ్లి జెండా ఎగరేస్తానని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ కూటమి ఆలోచన తనకు ఎప్పట్నుంచో ఉందనీ, ఇన్నాళ్లకు బయటపెట్టానని అన్నారు. 2019 తరువాత జాతీయ స్థాయిలో టి.ఆర్.ఎస్.ది కీలకపాత్ర అవుతుందనీ, దేశానికి తెలంగాణ దారి చూపిస్తుందని చెప్పారు. సింగపూర్ ది గొప్ప విజయగాథ అంటూనే మూడున్నరేళ్లలో తెలంగాణను తామూ అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరోసారి టిక్కెట్లు ఇస్తాననీ, వచ్చే ఎన్నికల్లో 106 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.
ఇంతకీ, కేసీఆర్ ది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా అనేదే చర్చనీయం అవుతోంది . ఎందుకంటే, కొత్త కూటమికి తానే నాయకుడనని స్వీయ ప్రకటన చేసుకున్నారు. కానీ, ఆయన నాయకత్వం కింద పనిచేసేందుకు మమతా బెనర్జీ సిద్ధపడతారా, స్టాలిన్ ముందుకొస్తారా, భవిష్యత్తులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేస్తారా, మరో రాష్ట్రంలోని ఇంకో బలమైన ప్రాంతీయ పార్టీ ఒప్పుకుంటుందా… మూడో కూటమి చుట్టూ ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముందుగా భావ సారూపత్య గల పార్టీలతో చర్చించుకుని, ఆ తరువాత నాయకత్వం గురించి మాట్లాడాలి. కానీ, ఆ స్థాయి కూడా దాటేసి, మరో అడుగుముందుకేసి మోడీ తరహాలో ఢిల్లీ జెండా పాతేస్తా అంటున్నారు కేసీఆర్. ఈ వ్యాఖ్యల ద్వారా మూడో కూటమి కేసీఆర్ వ్యక్తిగత అజెండా మీద నిర్మితం కాబోతోందనే సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది. ఓరకంగా ఇది అతి విశ్వాసమే అనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే… వారంపదిరోజులుగా కేసీఆర్ కేవలం జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. దేశానికి తెలంగాణ అవసరమనీ, దారి చూపుతుందనీ అంటున్నారు. అంటే, ‘మన తెలంగాణ బిడ్డ ఢిల్లీని ఏలబోతున్నాడ’నే ఒక ఎమోషనల్ అంశాన్ని అంతర్లీనంగా తెరపైకి తెస్తున్నారు. ఏలితే మంచితే, తెలుగువారందరూ హర్షించదగ్గ పరిణామమే. కానీ, తాజా వ్యాఖ్యల ద్వారా క్షేత్రస్థాయిలో తెరాసపై వ్యక్తమౌతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవచ్చనేది కూడా కేసీఆర్ వ్యూహమై ఉండొచ్చనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలవైపు ప్రజల దృష్టిని వెళ్లనీయకుండా, జాతీయ రాజకీయాలవైపు మళ్లించే ప్రయత్నంలో ఇలా మాట్లాడుతున్నారనీ అనుకోవచ్చు.