తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. తన కుమార్తె జైల్లో ఉంటే తండ్రిగా తనకు బాధ ఉండదా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున .. పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి ఏదో అయిపోతోందని.. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని అలాంటిదేమీ లేదన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా తాము ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పాలనపై దృష్టి సారించకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతిభద్రతలు ఇప్పుడు దారి తప్పాయన్నారు. ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే.. వాళ్లు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆవేదన ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కొత్త నేతల్ని తయారు చేసుకుందామన్నారు.
Also Read : పార్లమెంట్ సమావేశాలు.. కేసీఆర్ సైలెన్స్ కు కారణం ఇదేనా?
కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన బడ్జెట్ రోజు హాజరవుతారా.. బుధవారం నుంచి హాజరవుతారా అన్నది స్పష్టత లేదు. కవిత నాలుగు నెలల నుంచి జైల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని తెలంగాణలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఇలా ఎమ్మెల్యేలకు వివరణలాగా చెప్పడం వారికి కూడా ఆశ్చర్యంగానే అనిపించింది.