తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు తక్షణం సమాచారం తెలియాలంటూ.. కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్న సమయంలో… ఆయన ఓ రైతుతో ఫోన్లో మాట్లాడినట్లుగా సీఎంవో మీడియాకు సమాచారం పంపింది. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్.. కాళేశ్వరం జలాలతో.. ఇంకా ఆయుకట్ట లేని ఎన్ని ఎకరాలు ఉన్నాయో.. వాటన్నింటికీ నీరు అందించే ఆలోచనలు చేస్తున్నరట్లుగా… సీఎంవో ఆ ప్రకటన పంపింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డితో బుధవారం రాత్రి కేసీఆర్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. వరద కాలువను నిర్మించి.. నీటి కొరత తీరుస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఓ వైపు కేసీఆర్ కనిపించడం లేదని కొంత మంది.. ఆయనకు కరోనా సోకిందని.. మరికొంత మంది.. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియచెప్పాలని మరికొంత మంది వివిధ పద్దతుల్లో డిమాండ్లు చేస్తున్న సమయంలో… హఠాత్తుగా కేసీఆర్.. ఫోన్ కాల్ రూపంలో… రైతుతో మాట్లాడినట్లుగా సమాచారం బయటకు పంపడం వ్యూహాత్మకమేనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. వైరస్ బారిన పడిన వారికి కనీస వైద్యం అందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే టెస్టుల విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్.. ఎవరికీ కనిపించడం లేదు. అధికారులతో సమీక్ష లు కూడా నిర్వహించడం లేదు.
రైతులకు కేసీఆర్ ఫోన్‌కాల్స్ చేయడం.. ఇదే మొదటి సారి కాదు. గతంలో రెవిన్యూ సంస్కరణలు తీసుకు రావాలనుకున్నప్పుడు… ఇలా భూ వివాదంలో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఓ రైతుకు ఫోన్ చేసి.. సమస్యను పరిష్కరించారు. రెవిన్యూ అవినీతిని వెలికి తీశారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు అందే గ్రామాల రైతులు… నిర్వాసితులతోనూ మాట్లాడారు. ఇప్పుడు… కూడా.. అదే తరహాలో మాట్లాడారు. అయితే కరోనా గురించి పట్టించుకోవాల్సిన కేసీఆర్… ఇతర అంశాలపై… దృష్టి పెట్టి.. ఫోన్లు చేస్తున్నారని సమాచారం బయటకు పంపడం ఏమిటన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.