బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలు, భావసారూప్య పార్టీలతో మంతనాలు జరుపుతున్న కేసీఆర్.. జాతీయస్థాయిలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పేందుకు హైదరాబాద్ వేదికగా సదస్సు నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీనిని ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీల నేతలందరూ బిజీగా ఉంటారు. ఎన్నికలయిన తర్వాత అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చిలో జరుగనున్న యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవానికి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆ సందర్భంగా సమావేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకపక్షాలను ఏకం చేసేందుకు ఆయా పార్టీలకు తమ సహాయ సహకారాలు అందించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని సమాజ్ వాదీ పార్టీకి మద్దతిచ్చేఆలోచన చేస్తోంది. యూపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్ వాదీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇటీవల ట్విట్టర్లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్‌లో మంత్రి సమాధానం ఇచ్చారు. సంప్రదింపుల తర్వాత అక్కడ వారికి మద్దతుగా ప్రచారం చేయడంపై స్పందిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌గానీ, టీఆర్ఎస్ ప్రతినిధి బృందం కానీ అఖిలేష్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఆ భేటీలో ఖరారు కానుంది.
యూపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార బృందానికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించే చాన్స్ ఉంది. యూపీలో పలు చోట్ల తెలుగువాళ్లకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామన్న సందేశాన్ని టీఆర్ఎస్ పంపాలనుకుంటోంది.