మూడో సారి గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా… అభ్యర్థుల్ని ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందు కోసం అవసరమైన కసరత్తును ఫామ్ హౌస్ వేదికగా పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం… రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతీ రోజూ బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డీఎస్పీలు.. సీఐలు… అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగ్లను కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు.
ఇక సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్ఏలు కొన్నాళ్లుగా ఆత్మహత్యలు చేసకుంటున్నా పట్టించుకోని కేసీఆర్… తాజాగా వారిని ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ నాలుగు వేలకు పెంచారు. ముస్లింలకు రూ. లక్ష సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు.
అదే సమయంలో పార్టీ టిక్కెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత కేసీఆర్ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఈ అంశంపై మూడునెలల కిందటే లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్నారు. కనీసం పాతిక మంది సిట్టింగ్లకు సీట్లు ఉండవన్న సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ , కేసీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టి… టిక్కెట్లపై ఆశలు వదిలేసుకోమని సంకేతాలు ఇచ్చారు. పార్టీటూర్పై వెళ్లినప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గం చిన్నయ్య లాంటి ఎమ్మెల్యేను కేటీఆర్ ప్రోత్సహించి తన పక్కన కూర్చోబెట్టుకున్నా రు… అదే మహబూబాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ఎమ్మెల్యే షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కనీసం ఆసక్తి చూపించలేదు. ఇలాంటివి చాలా నియోజకవర్గాల్లో జరిగాయి. దీంతో టిక్కెట్ రాదనుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు క్లారిటీ వస్తోంది.
అయితే అధికారిక ప్రకటన కోసం.. ఎన్నికల షెడ్యూల్ వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదని.. ఉంటే ఉంటారు లేకపోతే లేదు…. అని ఆగస్టులోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత అసంతృప్తిని ఎలా డీల్ చేయాలో తెలుసని ఆయన అనుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ఎ ఎప్పట్లాగే ఇతర పార్టీలు ఇంకా ప్రిపరేషన్స్ కుస్తీలోనే ఉండగానే మరో విజయం కోసం తాను పరుగు ప్రారంభించబోతున్నారు..