తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. మరో హోమం చేయించబోతున్నారు. తెచ్చి పెట్టుకున్న ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం.. ఆయన ఈ హోమం చేయించబోతున్నారు. మూడు రోజులపాటు హోమాలు చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే కోరికతో గతంలో ఆయన అత్యంత భారీగా అయుత చండీయాగం చేశారు. హోమాలపై.. అత్యంత నమ్మకం చూపే.. కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ యాగం తలపెట్టారు. శంషాబాద్ మండలం ముచ్చింతలలోని చినజీయర్‌స్వామి దివ్యసాకేతాశ్రమంలో వేదపండితులతో దీనిపై సంప్రదింపులు జరిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గానీ, చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలోగానీ ఈ హోమాల్ని నిర్వహించాలని నిర్ణయించారు.
చండీ హోమం, సుదర్శన హోమంతో పాటు కేసీఆర్ జన్మ నక్షత్రానికి సంబంధించిన హోమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. పండితులతో చర్చించి ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో శనివారం చినజీయర్‌స్వామి పుట్టినరోజు మహోత్సవాల్లో శనివారం కేసీఆర్ పాల్గొన్నప్పుడు.. హోమం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అక్కడి కోదండ రాముడి ఆలయంలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించి, యాగం జరుగుతున్న చోట కొద్దిసేపు కూర్చున్నారు. ఋత్విక్కులు ఆయనకు కంకణం కట్టి తీర్థప్రసాదాలు అందించారు.
కేసీఆర్‌కు వాస్తు, హోమాలపై అమితమైన నమ్మకం. అసెంబ్లీని కూడా.. ఈ నమ్మకాలతోనే రద్దు చేశారని.. సమయం చూసుకుని… ఎన్నికలు వచ్చేలా చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన వాస్తు బాగోలేదన్న కారణంగా.. సచివాలయాకి … నాలుగున్నరేళ్లలో రెండు, మూడు సార్లు మాత్రమే వెళ్లారు. అదే వాస్తు బాగోలేదన్న కారణంగా.. కొత్తగా ప్రగతి భవన్ నిర్మించారు. ఇప్పుడు హోమానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ పోరాటంలో తీరిక లేకుండా ఉండాల్సిన సమంయలో.. స్వయంగా మూడు రోజుల పాటు హోమంలో కూర్చుకుంటారో.. లేక… ఋత్విక్కులతోనే పని కానిస్తారో వేచి చూడాలి..!