తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ఎక్కువగా జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవలే తమిళనాడు వెళ్లొచ్చారు. తెరాస ప్లీనరీలో కూడా ఎక్కువగా ఇదే అంశమై మాట్లాడారు. ఫ్రెంట్ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నది తక్కువే. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హడావుడి పెంచింది. వరుసగా ప్రముఖ నేతల్ని చేర్చుకుంటూ, ఇతర పార్టీలనూ సంఘాలనూ కలుపుతూ తెరాసపై పోరాటానికి సై అంటోంది. ఇంకోపక్క, తెలంగాణ జన సమితి అంటూ కోదండరామ్ కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఆవిర్భావ సభకు బాగానే స్పందన వచ్చింది.
ఎవరొచ్చినా ఏం చేసినా తమ అధికారానికి వచ్చే ఇబ్బందేం లేదన్నట్టుగా తెరాస వైఖరి కనిపించింది. కొత్త పార్టీ వల్ల తమ ఓట్లు చీలవని కొంతమంది తెరాస నేతలు ధీమాగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఈ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కాస్త తీవ్రంగానే ఆలోచిస్తున్నారట! ఎన్నికలకు ఏడాదే సమయం ఉంది కాబట్టి, మరికొద్ది రోజుల్లో మరిన్ని జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా సొమ్ము ఇచ్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత, మరి కొన్ని పథకాలను డిజైన్ చేసి, దశలవారీగా ఒక్కో పథకాన్నీ ప్రవేశపెట్టాలనీ, తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం.
నిజానికి, ఇప్పటికే గొర్రెల పెంపకం, వృత్తుల వారికి సాయం అంటూ చాలా జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టారు. వీటిపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా… లబ్ధిదారుల నుంచి మంచి స్పందనే ఉంది. కాబట్టి, ఇలాంటివే మరికొన్ని డిజైన్ చేయడం ద్వారా, ప్రజల్లో ఉన్న సంతృప్తిని ఎన్నికల వరకూ కొనసాగించాలని అనుకుంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో నిర్మితమౌతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. చేసినవి ప్రచారం చేసుకోవడం, కొత్త ఆకర్షక పథకాలు ప్రవేశపెట్టడంపైనే తెరాస శ్రద్ధ పెట్టబోతోందని తెలుస్తోంది.