హైదరాబాద్: దుబాయ్‌లోని 163 అంతస్తుల బుర్జ్ ఖలీఫా, చైనాలోని 128 అంతస్తుల షాంఘై టవర్స్ స్థాయిలలో హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ తీరంలో 150 అంతస్తులతో తెలంగాణ సిగ్నేచర్ పేరుతో ఎత్తయిన టవర్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. తెలంగాణకు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఒక ప్రత్యేకత ఉండాలని, అందుకే దేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని కేసీఆర్ యోచన. ఇదికాక సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి హకీంపేట ఎయిర్ బేస్ వరకు 11 కిలోమీటర్లమేర రు.1,000 కోట్ల వ్యయంతో, బాలానగర్ నుంచి నర్సాపూర్ రోడ్డును అనుసంధానిస్తూ రు.700 కోట్లతో మరో కారిడార్ కూడా నిర్మించనున్నారు.
సిగ్నేచర్ టవర్‌ను హుస్సేన్ సాగర్ తీర్ంలో లుంబిని పార్క్, బోట్ క్లబ్, టూరిజం ఆఫీస్ ఉన్న ప్రాంతంలో నిర్మించేందుకు ప్రాధమికంగా ప్రణాళికనుకూడా సిద్ధంచేశారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా దీన్ని నిర్మించాలని, భారతదేశానికి ఒక బహుమానంగా అందించాలని కేసీఆర్ సంకల్పించారు. దీనిపై ఆయన గురువారం మూడుగంటలపాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. తన కార్యాలయంలోని అటెండర్ ఎల్లయ్య మొదలుకొని సీఎస్ రాజీవ్ శర్మ వరకు ఉద్యోగులందరినీ పేరుపేరునా పిలిచి దీనిపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. సీఎల్ ఆలోచనను అందరూ స్వాగతించారు(స్వాగతించక చస్తారా…!). ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు – కేసీఆర్ లక్కీ నంబర్ 6 కాబట్టి ఈ టవర్స్‌లో 150 అంతస్తులు పెట్టమని సూచించారట.
ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, కరవు పరిస్థితులతో రాష్ట్రం అల్లాడుతుంటే కేసీఆర్ డాబుకు పోయి ఈ భారీ కట్టడాల నిర్మాణం చేపట్టటం చూస్తుంటే ఆయన తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని చెప్పక తప్పదు. గతంలోకూడా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తానని కేసీఆర్ ప్రకటించారు. పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు ఆ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అటు కోర్ట్ కూడా ఆ ప్రతిపాదనను అడ్డకుంది. దీంతో ఆ సమస్యలను న్యాయపరంగా తొలగించి ప్రతిష్ఠాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టాలని సీఎమ్ ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ వార్త ‘సాక్షి’ పేపర్లో తప్పితే టీఆర్ఎస్ పార్టీ పత్రిక అయిన ‘నమస్తే తెలంగాణ’ సహా ఏ ఇతర పత్రికలోనూ రాకపోవటం విశేషం. టీఆర్ఎస్ ఎంపీ కవిత సాక్షి మీడియా ఛైర్ పర్సన్ భారతిని కలిసిన మరుసటిరోజే ఈ వార్త సాక్షిలో వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.