తెలంగాణ సీఎం కేసీఆర్… ఎన్నికలకు ముందు చేసే రాజకీయం భిన్నంగా ఉంటుంది. ప్రజల్లో తమ ప్రభుత్వంపై చర్చ రేపుతారు. చేసిన మేలు. చేయబోయే మేళ్ల గురించి చేసే ప్రకటనలు ఓ రేంజ్లో ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఆర్టీసీ విలీనం, హైదరాబాద్ మెట్రో, వరంగల్ ఎయిర్ పోర్టు అంటూ చేసిన ప్రకటలు హైలెట్ అయ్యాయి. వీటిపై విస్తృత చర్చ జరుగుతుంది.. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను మర్చిపోయే పట్టం కట్టేస్తారని భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ నిర్ణయాలపై అనుకున్నంత చర్చ జరగకపోగా.. ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ భూమండలం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం జరగదని గతంలో తేల్చి చెప్పారు. 50కిపైగా కార్పొరేషన్లు ఉన్నాయని వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమని డిమాండ్లు వస్తాయన్నారు. అందుకే అప్పట్లో సాధ్యం కాదని తేల్చారు. ఇప్పుడు ఎవరూ అడగకపోయినా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు క్లారిటీ రావడంతో ఇక్కడ వారిలో అంత స్పందన రాలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ట్రీట్ మెంట్ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.. ఎన్నికల స్టంట్ అనుకుంటున్నారు.
ఇక హైదరాబాద్ మెట్రో కూడా కట్టేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఫ్లైఓవర్లు కట్టడానికి ఏడెనిమిదేళ్లు పడుతూంటే… నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తామనడం పూర్తి జిమ్మిక్కేనని నమ్ముతున్నారు. అందుకే.. కేబినెట్ నిర్ణయాలు ప్రజల్లోకి పెద్దగా వెళ్లడంలేదు. దీంతో కేటీఆర్
రంగంలోకి దిగారు. కేబినెట్ నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని… పార్టీ నేతల్ని ఆదేశించారు. కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని.. కానీ నెగెటివ్ కోణంలో వెళ్తున్నాయన్న సంగతిని పార్టీ నేతలు… కేటీఆర్కు చెప్పలేకపోతున్నారు.