జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారన్న నమ్మకాన్ని కేసీఆర్ కలిగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన వెళ్లి కలిసి వచ్చేవారు. కానీ ఇప్పుడు నేతలు ఆహ్వానిస్తున్నారు. నిన్న దేవేగౌడ ఫోన్ చేసి కేటీఆర్ పోరాటాన్ని అభినందించారు. ఇవాళ మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ధాకరే కేసీఆర్కు ఫోన్ చేశారు. ఈ నెల 20 తేదీన ముంబైకి రావాలని ఆహ్వానించారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు.
సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కెసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు. మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారని.. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారని ప్రశంసించారు.
రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని కోరారు. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకూ జాతీయ రాజకీయల విషయంలో ఉద్దవ్ ధాకరే ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల నాయకులతో మాట్లాడిన దాఖలాలు లేవు. మొదటి సారి సీఎం కేసీఆర్ను ఆహ్వానించడం జాతీయ రాజకీయాల్లో వస్తున్న కీలక మార్పులను సూచిస్తున్నాయి.