మాజీ ప్రధాని, దేశంలో సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావుకు మరణానంతరం ఇప్పటి వరకూ అందకుండా పోయిన గౌరవాన్ని తాము ఇవ్వాలని .. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. కారణం ఏదైనా పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ .. మరణానంతరం దూరం చేసుకుంది. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన అత్యున్నత స్థానానికి ఎదిగినా… అంతర్గత రాజకీయాల కారణంగా.. ఆయన చాలా మందికి కాని వారయ్యారు. ఫలితంగా… దేశ ప్రధానులందరికీ.. ఢిల్లీలో ఘాట్లు నిర్మించారు కానీ.. పీవీ చనిపోయిన తర్వాత ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు కూడా ఆయనను స్మరించే పరిస్థితి లేదు. అందుకే.. పీవీ నరసింహారావు విషయాన్ని టీఆర్ఎస్ టేకప్ చేసింది.
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా జరపాలని నిర్ణయించుకుంది. రెండు రోజుల క్రితం.. కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను మోడీని కలుస్తానని కూడా…. ప్రకటించారు. జూన్ 28న పీవీ జయంతి కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రకటన తర్వాత .. కేటీఆర్ ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నారు. కనీసం 51 దేశాల్లో.. పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. 51 దేశాల ఎన్నారైలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ మహనీయుల అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జూన్ 28 పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ జయంతి నాటి నుంచి … ప్రారంభించి.. ఏడాది పాటు ఉత్సవాలు జరపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసేందుకు కమిటీని నియమిస్తారు. వచ్చే ఏడాది జూన్ 28న భారీ స్థాయిలో కార్యక్రమాలు చేసి.. క్లింటన్ లాంటి విదేశీ నేతల్ని కూడా ఆహ్వానించాలనుకుటున్నారు. పీవీ నరసింహారావును తెలంగాణ సర్కార్ గౌరవించడంలో.. ప్రత్యేకంగా రాజకీయం ఉందో లేదో కానీ.. ఈ ప్రయత్నాలు మాత్రం.. పలువురి ప్రశంసలకు కారణం అవుతున్నాయి. దేశానికి కొత్త దారి చూపించిన పీవీకి ఇప్పటికైనా సముచిత గౌరవం దక్కుతోందన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.