టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీఎంగా కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆ అభివృద్ధి పైకి కనిపించేదే .. వాటి వల్ల ప్రజలకు కలిగిన లాభం కన్నా .. కలిగిన నష్టమే ఎక్కువన్న భావన అక్కడి ప్రజల్లో ఉంది. అందుకే కేసీఆర్..మేడ్చల్ నుంచి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గజ్వేల్‌లో కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా … కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రమే కాదు.. అక్కడి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన క్షేత్ర స్థాయిలో విస్తృతం పర్యటిస్తున్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు తెలువని వారు గజ్వేల్ నియోజకవర్గంతో ఉండరు. అంతగా ప్రజా జీవితంలో మమేకమయ్యాడు. 2009 ఎన్నికల్లో సీనియర్లను కాదని చంద్రబాబునాయుడు టికెట్ కేటాయించడంతో అక్కడ గ్రూపులు తయారయ్యారు. ఈ కారణంగా ఏడు వేల తేడాతో ఓడిపోయారు. అయినా సరే పార్టీ కోసం పని చేస్తూ ప్రజల్లో పట్టును పెంచుకున్నారు. 2014 ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్నారు.
అసలు గత ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి దిశగా ఉన్నారన్న విశ్లేషణలు వచ్చాయి. దాంతో హరీష్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో రహస్య ఒప్పందం కుదిర్చుకుని.. ఆయన పోటీ నుంచి తప్పుకునేటట్లు చేశారు. కీలకమైన సమయంలో ఆయన ప్రచారం నిలిపివేసి.. తన క్యాడర్ మొత్తం టీఆర్ఎస్కు ఓట్లు వేసేలా చేశారు. దీంతో కేసీఆర్ 19,391 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పుడు 86,694 ఓట్లు కేసీఆర్ సాధించగా, 67,303 ఓట్లు ప్రతాప్రెడికి వచ్చాయి. నర్సారెడ్డికి 34,0 85ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రతాప్‌రెడ్డి రెండవసారీ ఓటమి చెందారు.
నియోజకవర్గంలో టీఆర్ఎస్ పై అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణంగా కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్య నిలుస్తోంది. ముంపు గ్రామాల ప్రజలు తమకు ఇస్తున్న నష్టపరిహారం పట్ల ఏ మాత్రం సంతృప్తిగా లేరు. అలాగే.. గజ్వేల్ పట్టణ అభివృద్ధి ఎంత వేగంగా జరిగిందో.. రోడ్ల వెడల్పులో ఇండ్లను, స్థలను కోల్పోవడం.. బస్టాండు తరలింపు.. రింగురోడ్డులో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం టీఆర్ఎస్కు నష్టం చేసే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణ ఉంది. టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అసంతృప్తిలో ఉన్నారని.. ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ధిపొందాలని ప్రతాప్‌రెడ్డి ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. పలువురు ముఖ్య యువనాయకులు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతాప్‌రెడ్డి బలం పుంజుకుంటున్నట్లు అందరు భావిస్తున్నారు. బలమైన అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉండనుండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో లోలోపల భయం ఉన్నా బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్‌రావు రంగప్రవేశం చేసి పరిస్థితులను మామకు అనుకూలంగా మార్చే ఎత్తులు వేస్తున్నారు. ముందు ముందు గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఉత్కంఠ రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.