” నవ్విన నాప చేనే పండుతుంది ” .. అనే సామెత.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. ఆ బక్క మనిషి తెలంగాణ సాధించగలరా..? . ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధిస్తారా..? అన్న ఎకసెక్కాలు అప్పట్లో చాలా వినిపించాయి. ఇంట్లో నుంచి బయటకు రాడు.. ఉద్యమమేం చేస్తాడని విమర్శించారు. కానీ.. అలా అన్న వాళ్లు ఇప్పుడు చేతులు కట్టుకుని ఆయన ముందు నిల్చుంటున్నారు. దశాబ్దాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాధించారు. ఇప్పుడాయన.. మరో మిషన్ పెట్టుకున్నారు. అదే జాతీయ రాజకీయాల్లో ముద్రవేయడం.
కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టడం విశేషం ఏమీ కాదు.. ఎప్పటి నుంచో చెబుతున్నదే..!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది హఠాత్ పరిణామం కాదు. ఆయన జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని చాలా కాలంగా చెబుతున్నారు. దేశం మొత్తానికి సరిపడా నీళ్లు ఉన్నా..వాడుకోలేని దుస్థితిలో దేశం ఉందని ఆయన చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని సరైన విధంగా పరిపాలించి.. అందరి బతుకుల్ని బాగు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయని చాలా సార్లు చెప్పారు. ఆ క్రమంలోనే అవసరం అయితే కొత్త పార్టీ పెడతానని కూడా చాలాసార్లు చెప్పారు. గత ఎన్నికలకు ముందే దీనికి సంబంధించిన కసరత్తు చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఆయన కొత్త కూటమి… కొత్త పార్టీ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. కానీ రెండో సారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆయన ఎక్కువ సమయం జాతీయ రాజకీయాలపైనే దృష్టి సారించారు. కుమారుడు కేటీఆర్… పాలన విషయంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు ప్రధానమైన విషయాల్లో మాత్రం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. మిగతా సమయం ఆయన జాతీయరాజకీయాలపై సమాచార సేకరణ..విశ్లేషణతో..వ్యూహం ఖరారు చేసుకుంటున్నారని భావించవచ్చు.
పార్టీనా..? వేదికనా..? కేసీఆర్ ప్లానేంటి..?
కేసీఆర్ పెట్టబోయే నయా భారత్ కొత్తపార్టీనా..లేకపోతే.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చే కూటమినా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే..జాతీయపార్టీ అంటే…ఆషామాషీ కాదు. దక్షిణాదిలో ఆ పార్టీ నిలదొక్కుకోపడం అసాధ్యం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఉత్తరాదిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కేసీఆర్ అక్కడి ప్రజల్ని ఎంత మేర ఆకర్షించగలరనేది కీలకం. నిజానికి కేసీఆర్ పథకాలపై ఉత్తదారిలో మంచి అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టినప్పుడు..దానికి జాతీయ స్థాయిలో కవరేజ్ వచ్చేలా చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. కేసీఆర్ ఢిల్లీలో ఉంటే దేశంలోని రైతులందరికీ..రైతు బంధు వస్తుందన్న అభిప్రాయాన్ని కల్పించగలిగారు. అలాగే.. దక్షిణాది కన్నా..ఉత్తరాది రైతులకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం…ప్రభుత్వం పంటలు కొనకపోవడం..కొన్నా డబ్బులు చెల్లించడానికి నెలల తరబడి సమయం తీసుకోవడం లాంటి మౌలికమైన సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. వాటన్నింటికీ కేసీఆర్ తెలంగాణలో పరిష్కారం చూపించారన్న అభిప్రాయం..ఉత్తరాదిలో కల్పించడానికి టీఆర్ఎస్ వర్గాలు చాలా కాలం నుంచి జాతీయమీడియా ద్వారా ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ..ఉత్తరాది రాజకీయాలు కేవలం రైతుల సమస్యల మీదనే నడవవు..కుల, మత కోణాలు ఉంటాయి.
దక్షిణాదిని ఏకతాటిపైకి తెస్తే కేసీఆర్ సగం విజయం సాధించినట్లే..!
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆయా పార్టీలు తమ తమ సిద్దాంతాలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ ఉంటాయి. తమిళనాడులో డీఎంకే ఇటీవల హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని అందుకుంది. జాతీయ విద్యావిధానంలో మూడు భాషల్ని ప్రతిపాదించడాన్ని అక్కడి రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఇక కర్ణాటకలో జాతీయ పార్టీల మధ్య జేడీఎస్ బలంగా ప్రాంతీయవాదం వినిపిస్తోంది. ఆ పార్టీ ప్రాధాన్యాలు వేరు. కేరళలో రెండు బలమైన భావజాలాల మధ్య పోరు ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆయన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే ఎంపీలతో వ్యూహాలు అమలు చేస్తారు…తప్ప రాజకీయం జోలికి పోరు. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీతో కేసీఆర్ సన్నిహితంగా ఉంటున్నారు. అయితే.. బీజేపీని కాదని..వ్యతిరేక కూటమిలో చేరే అవకాశం లేదనే అంచనా రాజకీయ నేతల్లో ఉంది.
కేసీఆర్ రాజకీయ వ్యూహచతురత ఊహకు అందనిది..!
కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం.. ఎవరికీ సాధ్యం కాదు. అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని.. ఆయన తెలంగాణ ఉద్యమంతో నిరూపించారు. అసలు తెలంగాణ ఉద్యమం పనైపోయిందనుకున్న సమయంలో.. ఓ ఘటనతో వచ్చిన అవకాశాన్ని .. ఆయన తనకు అనుకూలంగా మల్చుకుని చేసిన ఉద్యమం రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేకపోయారు. జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ అలాంటి అద్భుతం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీలన్నీ..ఎవరికి వారుగా ఉంటున్నారు. కానీ కలిస్తే మాత్రం బలీయమైన శక్తి అవుతుంది. ఈ విషయంలో కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఆయన గత ఎన్నికల ముందు నుంచీ… ప్రాంతీయ పార్టీల అధినేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడుతోంది అటూఇటుగా రెండు వందల పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే. దాదాపుగా 350 అంటే మెజార్టీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలతోనే జాతీయపార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ కారణంగా… కేసీఆర్ ప్రాంతీయపార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తే.. గేమ్ చేంజర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.
కేసీఆర్ అప్పట్లో తెలంగాణ తెస్తానంటే నవ్వారు. అలాగే ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానంటే కూడా నవ్వుతారు. అందులో డౌట్ లేదు. కానీ.. ఇప్పుడు ఫలితం ఏమయింది. తెలంగాణ సాధించారు. తర్వాత కూడా అదే జరగొచ్చు. కాదనలేం..ఎందుకంటే.. కేసీఆర్ ఆషామాషీ రాజకీయనాయకుడు కాదు. ఆ విషయం ఆయన రాజకీయంలోనే కనిపిస్తూ ఉంటుంది.