తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ప్రతిభావంతమైన వ్యవహారమే అయినా మరీ అతిగా పొగిడేందుకు కొందరు పోటీ పడటం హాస్యాస్పదం. ఈ ప్రక్రియ వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి.ఇప్పుడు ఇంకా సులభతరమైంది కూడా.సూళ్లలో కాలేజీల్లో కూడా వాడుకలో వుంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు ఇలాటి వాటిపై చాలా మోజు చూపేవారు. శాసనసభలో ప్రెజంటేషన్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు గాని ఇదే తుది వాక్యం కావడానికి అవకాశముండదు. సాధారణ చర్చ ఎలాగూ తప్పదు. కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికోణం కళ్లకుకట్టి చూపడానికి అదనంగా ఉపయోగం కావచ్చు.
ఈ ఉదంతంలో అంతగా చర్చించని కోణం మరొకటి వుంది. అది నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు పాత్ర. యువ నాయకుడుగా చురుగ్గా పనిచేసే హరిష్ వుండగా కెసిఆర్ తనే అన్నీ వివరించాల్సిన అవసరం వుందా? అందులో హరీశ్ చెప్పలేనివి ఏమైనా వున్నాయా? ఉద్యమ నేతగా కెసిఆర్ స్థానం ఆయనదైనా ఒకసారి సంబంధిత మంత్రి వివరించాక జోక్యం చేసుకోవడం వేరు.
ఇప్పటికే ప్రాజెక్టుల పూర్తికి కమిటీ అంటూ ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులను నియమించారు. ఇప్పుడేమో తనే రంగంలోకి దిగారు. మాటల మధ్యలోనూ ఆయన పేరును పెద్దగా ప్రస్తావించలేదు. కారణాలేమైనా ఇది మంచి సంప్రదాయం కాదని నిపుణులు భావిస్తున్నారు. మరో సందర్భంలోనైనా సంబంధిత మంత్రితో మాట్లాడించడం గౌరవంగా వుంటుంది.
శాసనసభలో ఈ తతంగం ముగిసిన మర్నాడే కెటిఆర్ హైదరాబాదులో పర్యటనకు బయిలుదేరడం దానికి మీడియాలో చాలా ప్రచారం రావడం చూస్తే తేడా మరింత ప్రస్పుటమవుతుంది. ఇవన్నీ అనవసరమైన పరిశీలనలని ముఖ్యమంత్రి శిబిరం అనవచ్చు గాని బాహాటంగా కనిపించేవాటిపై మాట్లాడకుండా వుండటం ఎలా సాధ్యం?