తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులో తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఉన్న పరిస్థితుల కారణంగా బంగారు తెలంగాణ బ్యాచ్.. ఉద్యమ తెలంగాణ బ్యాచ్ మధ్య తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, గవర్నర్ కోటా కింద కలిపి మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
తాము ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్నామని తమకు చాన్సివ్వాలని ఎక్కువ మంది లాబీయింగ్ చేసుకుంటున్నారు. హామీతోనే తాము బంగారు తెలంగాణ ఆశించి టీఆర్ఎస్లో చేరామని అదే స్థాయిలో కేసీఆర్‌పై అవకాశాల కోసం ఇతరులు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఒత్తిళ్ల మధ్య అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కేసీఆర్ తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు దాదాపుగా ఖరారు చేశారు. ఇందులో గుత్తా, ఆకుల లలిత బంగారు తెలంగాణ బ్యాచ్. పాడి కౌశిక్ రెడ్డికి ఇవ్వక తప్పదు. ఆయన కూడా బీటీ బ్యాచ్.
ఇక అనేక ఆశలు చూపి పార్టీలో చేరిన వారంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వారందరికి ఎలా చాన్సివ్వాలా అని కేసీఆర్ సమీకరణాలు చూసుకుంటున్నారు. ఉద్యమకారులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే..ఇప్పటికే ఈటల వల రెడీ చేసి ఉంటారు. ఉద్యమకారులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి సర్కార్‌పై సమరం మోగిస్తానంటున్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు బంగారు తెలంగాణ బ్యాచ్ కన్నా ఉద్యమకారులకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్ర బ్యాలన్స్ తప్పినా ఈటల టీఆర్ఎస్ నుంచి యూటీ బ్యాచ్‌ను పట్టుకెళ్లిపోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారని భావిస్తున్నారు .