తెలంగాణలో కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడం, రేవంత్ రెడ్డిని నియంత్రించడం… అధికార పార్టీ తెరాసకు ఉన్న రాజకీయ లక్ష్యాల్లో ఇవీ ముఖ్యమైనవి! రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత తెరాసపై మరింత మాటల దాడి పెంచారు. గాంధీ భవన్ లో అడుగుపెడుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడిపై నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల అంశంతో ఆరోపణల సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీఆర్ పై రేవంత్ దూకుడు పెరుగుతుందన్న లెక్కలు అందరికీ ఉన్నాయి! అయితే, ఈలోగానే రేవంత్ ను కొంత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేందుకు తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు. రేవంత్ సొంత నియోజక వర్గమైన కొడంగల్ లక్ష్యంగా చేసుకుని.. అధికార పార్టీకి చెందిన ఓ ముగ్గురు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ కూడా కొంత అప్రమత్తం అవుతున్నారనీ, అందుకే ఈ మధ్య కొడంగల్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని సమాచారం.
రేవంత్ కాంగ్రెస్ లో చేరగానే, కొడంగల్ లో అతని అనుచరులను తెరాస ఆకర్షించే ప్రయత్నం చేసింది. కొంతమేరకు తెరాస వ్యూహం వర్కౌట్ అయిందని కూడా చెప్పొచ్చు. అయితే, ఈ మధ్య సొంత నియోజక వర్గంపై రేవంత్ కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకునేసరికి వలసలు ఆగిపోయినట్టు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు తెరాస అభివృద్ధి వ్యూహాన్ని కొడంగల్ లో అమలు చేస్తోంది. దీంతో కొడంగల్ లో ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డిలు వెళ్లిపోతున్నారు. ప్రారంభోత్సవాలూ శంకుస్థాపనలు అంటూ నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ప్రభుత్వం నుంచి రేవంత్ సాధించుకున్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు సాగనీయకుండా చేస్తున్నారే విమర్శ వినిపిస్తోంది. కొడంగల్ బస్ డిపో నిర్మాణం కోసం రేవంత్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తే, అధికార పార్టీ నేతలు కావాలనే దాన్ని పక్కన పెట్టేస్తున్నట్టు రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. కొన్ని కళాశాలల భవన నిర్మాణ అంశాల్లో కూడా రేవంత్ కు ఇలానే చుక్కెదురౌతోందట. దీంతో కొన్ని కార్పొరేట్ సంస్థల్ని సంప్రదించి, వారి నుంచి నిధులు సేకరించి, కొన్ని భవనాలను రేవంత్ రెడ్డి నిర్మింపజేస్తున్నారని ఆ వర్గం వారు అంటున్నారు.
ఇలా అన్ని మార్గాల ద్వారా రేవంత్ సొంత నియోజక వర్గంలో పాగా వేసేందుకు తెరాస సర్వశక్తులూ ఒడ్డుతోందనే అభిప్రాయం కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను కొడంగల్ లో ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో తెరాస ఇన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. కొడంగల్ లోనే ఆయన్ని ఆత్మ రక్షణలో పడేస్తే… దూకుడు కాస్త తగ్గుతుందని తెరాస అంచనా..! అభివృద్ధి, ఆకర్షణ, అడ్డగింపు.. అధికార పార్టీ అనుసరిస్తున్న ఈ త్రిముఖ వ్యూహాన్ని రేవంత్ ఎంత మేరకు సమర్థంగా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే..!