తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల బలహీనతల మీద కేసీఆర్ దెబ్బ కొడుతున్నారు. పార్టీ మారాలనుకునేవారిని ఆపేవారు లేకపోవడం.. అలాంటి స్థితిలో ఉన్న వారిపైనా.. కేసీఆర్ మార్క్ రాజకీయం జరుగుతూండటంతో… టీ కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే… పార్టీ ఘోర పరాజయానికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాలని డిమాండ్ లు వచ్చాయి. అంతకు ముందు… గెలుపైనా.. ఓటమి అయినా తనదే బాధ్యత అని చాలెంజ్ చేసిన ఉత్తమ్.. మొత్తం తప్పును ఈవీఎంల మీద నెట్టి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు.. ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలు జరిగాయని… కేసులు పెట్టారు. దీనిపై ఎన్నికల ప్రచారసభల్లో కేసీఆర్ హెచ్చరికలు కూడా చేశారు. కేసీఆర్ తీరు చూస్తే… వాటిపై చర్యలు తీసుకున్నా ఎవరూ ఆశ్చర్యపోరు. దాంతో ఉత్తమ్ సైలెంటయిపోయారు. ఎమ్మెల్యేలు పోతున్నా ఒక్క మాట మాట్లాడటం లేదు.
ఇప్పుడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు. ఎమ్మెల్యే లు చేజారిపోవటంతో సీఎల్పీ నాయకుడు భట్టి నాయకత్వానికి పరీక్షగా మారింది. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతూనే ఉన్నారు. అది ఆగేలా లేదు. అపే ప్రయత్నాన్ని కూడా పార్టీ.. ఇటు సీఎల్పీ చొరవ తీసుకోవటం లేదని విమర్శలు వచ్చాయి. రాహుల్ గాంధీ టూర్‌ని కూడా తూతూ మంత్రంగా నిర్వహించారు. గెలిచిన 19 మందిని కాపాడుకోలేని దుస్థితిలో టీకాంగ్రెస్ పడింది. మిగిలిన వారిని కాపాడుకునే పరిస్థితి లేదు. పార్టీ మారే వారిని ఎలా అపాలో కూడా అంతు చిక్కటం లేదు. ఈ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ నాయకులది మింగలేక..కక్కలేక అనే పరిస్థితి.
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా.. కేసీఆర్ దెబ్బకు.. కకావికలమైపోతున్నారు. ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణలో ఏం జరుగుతున్నా… స్పందించలేకపోతున్నారు. ఇదంతా.. కేసీఆర్ వ్యూహమే. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలందరి పరస్థితి అర్థమైపోయింది కనుకే… రాహుల్ గాంధీ అందర్నీ లోక్‌సభ బరిలో నిలుపుతున్నారు. ఎవరు గెలిస్తే.. వారికి సత్తా ఉన్నట్లు తేలిపోతుంది. ఆ తర్వాత ప్రక్షాళన ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.