హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రజాస్వామికంగా పొరబాటు. విమర్శలు నిరసనల తర్వాత కూడా దానిపై పునరాలోచించడానికి సిద్ధపడలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యామ్నాయం చెబుతున్నామే గాని ఇంకా అక్కడ దాన్ని రద్దు ఉత్తర్వులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఇలాటి పరిస్థితుల్లో కోదండరాం నాయకత్వంలోని జెఎసి, ఉభయ కమ్యూనిస్టుపార్టీలూ దీర్ఘకాలంగా దాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేశాయి. సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్ ఆవరణలో నెల రోజుల పాటు రోజుకో తరగతికి చెందిన వారు నిరాహారదీక్ష చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఇందుకు మద్దతు తెలిపింది. ఈ సోమవారం ఆక్యుపై ధర్నాచౌక్ కార్యక్రమం ప్రకటించాయి. సరిగ్గా ఇలాటి సమయంలో ఇందిరా పార్కు వాకర్స్, స్థానిక నివాసుల పేరుతో దాన్ని ఎత్తివేయాలన్న వాదన లేవదీశారు. సోమవారమే వారు కూడా ధర్నా ప్రకటించారు. గతంలో నిరుద్యోగ ర్యాలీ తరుణంలో వలెనే ఇప్పుడుకూడా పోలీసులు తీవ్ర నిర్బంధానికి పాల్పడతారనుకుంటే ఈ ఒక్కరోజు శాంతియుతంగా చేసుకోవచ్చని అనుమతించామన్నారు.ఇక్కడే తిరకాసు ఏమంటే ఉభయులకూ అనుమతినిచ్చారు. అప్పుడే ప్రభుత్వ వ్యూహం స్పష్టమైంది. వూహించినట్టే ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై తీవ్ర రూపం దాల్చింది. స్థానికుల ముసుగులో సంఘ వ్యతిరేకులను పురికొల్పి తమపై దాడులు చేశారని వామపక్ష నాయకులు ఆరోపించారు.కొంతమంది మీడియా వారితో సహా పలువురికి గాయాలు తగిలాయి. కుర్చీలు విరిగాయి.పోలీసులు లాఠీచార్జి చేశారు. కమ్యూనిస్టులు ముందే పథకం పన్ని ఇదంతా చేశారని అధికార పక్షం ఆరోపించింది. టి న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. కమ్యూనిస్టు కాంగ్రెస్‌లనే గాక కోదండరాం జెఎసి గూండాలు దాడి చేశారని కథనాలు ఇస్తూనే వుంది. ఏమైనా ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.