తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కొత్త సర్వేతో ముందుకొచ్చారు! వచ్చే ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని, తెలంగాణ ప్రజలు తెరాస వెంటే ఉన్నారంటూ వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో 111 సీట్లు తెరాసకి రాబోతున్నాయంటూ సర్వేలో తేలిందని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్వేలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు చాలా మెరుగైందని తేలినట్టు కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరికీ ర్యాంకులు కార్డులను స్వయంగా అందించారు. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ గ్యారంటీగా సీట్లు వస్తాయన్న భరోసా ఇవ్వడం విశేషం.
ఇక, పనితీరు విషయానికి వస్తే.. సర్వేలో అత్యధికంగా కేసీఆర్ కు 98 శాతం మార్కులు పడ్డాయి. ఆయన తరువాత రెండో స్థానంలో సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ 91 శాతం సాధించారు. మూడో స్థానంలో మంత్రి హరీష్ రావు 88 శాతంతో ఉన్నట్టు సర్వేలో తేల్చి చెప్పారు. గతంతో పోల్చుకుంటే మంత్రి కేటీఆర్ పనితీరు ఎంతో మెరుగుపడిందని తాజా నివేదిక చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెరాసకు 111 సీట్లు దక్కించుకుంటుందనీ, ఎమ్.ఐ.ఎమ్.కు 6 సీట్లు దక్కుతాయనీ, మిగిలిన రెండు చోట్లలో కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ సర్వే తేల్చింది. కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజక వర్గాల్లో మధిర, కల్వకుర్తిలు మాత్రమే ఉన్నాయి. మంత్రులూ ఎమ్మెల్యేల పనితీరు గతంతో పోల్చితే ఎంతో మెరుగుపడిందని, వారి పనితీరుకు మార్కులూ ర్యాంకులను కేసీఆర్ వెల్లడించారు.
నిజానికి, గత సర్వేతో పోల్చితే ఈ సర్వేలో ఎంతో మార్పు రావడం విశేషం! కేసీఆర్ చేయించుకున్న గత రహస్య సర్వే ప్రకారం తెరాస తరువాత రాష్ట్రంలో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందనీ, మంత్రులూ ఎమ్మెల్యేల పనితీరుపై స్థానికంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నట్టు తేలిందట! అందుకనే, మంత్రులకు క్లాసులు తీసుకున్నారు. కాంగ్రెస్ పై మాటల దాడికి దిగారు. అయితే, ఈ మధ్య కాలంలో ఏం మార్పు వచ్చిందోగానీ.. కాంగ్రెస్ కు రెండు సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవని కేసీఆర్ తాజా సర్వే చెప్పడం విశేషం. అంతేకాదు.. మంత్రుల పనితీరుపై అనూహ్యంగా వచ్చిన మార్పులేంటో తెలీదుగానీ, వారి గ్రాఫ్ లు కూడా అనూహ్యంగా పెరిగిపోయినట్టు సర్వే వెల్లడించడం మరో విశేషం.
ఈ పాజిటివ్ సర్వే ఫలితాలకు తాజా రాజకీయ పరిస్థితులు కారణమా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ వాయిస్ రెయిజ్ అవుతోంది. ఇంకోపక్క భాజపా ముంచుకొస్తోంది. మొన్ననే అమిత్ షా వచ్చారు. వచ్చే ఎన్నికల్లో దూసుకుపోతామని అంటున్నారు. రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తామని హామీలు ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రచారానికి వస్తారనీ, యోగీ ఆదిత్యానాథ్ ను కూడా తీసుకొస్తామనీ రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారు. ఇంకోపక్క, టీడీపీ మహానాడు కూడా జరిగింది. సో… ఇలాంటి పరిస్థితుల మధ్య ఫుల్ పాజిటివ్ సర్వే వచ్చిందంటే, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడంలో భాగమేమో అనిపిస్తోంది కదా! అంతేకాదు, అమిత్ షా పర్యటన, తెలుగుదేశం మహానాడు నుంచి మీడియా అటెన్షన్ తోపాటు ఆయా పార్టీలను కూడా డైవర్ట్ చేసినట్టు అవుతుంది కదా!