తెలంగాణ రాష్ట్ర సమితి పోలింగ్‌కు ముందు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారంతో మరింత టెన్షన్ పడుతోంది. ఇప్పటికే చేవెళ్లే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో వైపు రేవంత్ రెడ్డి… జోరుగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. డిసెంబర్ ఏడో తేదీ అంటే.. పోలింగ్ లోపు..మరో ఐదారుగురు వస్తారని.. దమ్ముంటే ఆపుకోవాలని సవాల్ చేస్తున్నారు. ఎంపీలు… పార్టీని వీడితే.. ఆ ప్రభావం.. ఆయా ఎంపీలు ఉన్న నియోజకవర్గాలపై పడుతుందన్న ఉద్దేశంతో.. కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అసంతృప్తిలో ఉన్న ఎంపీలను గుర్తించి.. వారికి టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. ప్రచారం జరిగిన వారిలో.. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఒకరు. ఆయనకు ఈ సారి టిక్కెట్ లేదని.. కేరళ క్యాడర్‌కు చెందిన తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారి లక్ష్మణ్ నాయక్ కు ఇస్తున్నారని టీఆర్ఎస్లో ప్రచారం జరిగింది. ఈ కారణంగా సీతారామ్ నాయక్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకున్నారు. వెంటనే.. టీఆర్ఎస్ హైకమాండ్.. సీతారాంనాయక్‌కు టిక్కెట్ ఖరారు చేసింది. ఈ సమాచారాన్ని ఎంపీకి పంపింది. పార్టీ మార్పు వార్తల్ని ఖండించింది. ప్రచారంలో కూడా… ఎంపీగా… సీతారామ్ నాయక్ ను గెలిపించాలని… టీఆర్ఎస్ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఇక అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న రెడ్డి సామాజికవర్గ ఎంపీలకు కూడా.. కేసీఆర్ టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లకు కూడా టిక్కెట్లు ఖరారు. కేసీఆర్ పాల్గొన్న ప్రచార సభల్లో ఎంపీలుగా వారు నిలబడతారని.. వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని.. కోరారు. దాంతో వారికి టిక్కెట్లు ఖరారయినట్లయింది.
పోలింగ్ గడువు దగ్గరకు వచ్చే సరికి.. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎంపీలు బాల్క సుమన్, చామకూర మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు కాక.. ఇంకా పదకొండు మంది ఎంపీలు ఉన్నారు. వీరందర్నీ టిక్కెట్ ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు… వారికి భరోసా ఇస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో 95 శాతంమంది సిట్టింగులకే టికెట్లు ఇచ్చినందున ఎంపీల్లోనూ ఎక్కువమందికి మళ్లీ టికెట్లు రావడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఎంత మంది.. కేసీఆర్ హామీల్ని నమ్ముతారో కానీ… రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మాత్రం.. ఆ ఎంపీలకు .. సొంత పార్టీలోనే భరోసా తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.