గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా… ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో పాల్గొననున్నారు. ఇందు కోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదల రోజు.. కీలక వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. అయితే.. ఆ రోజుకు.. ఇప్పటికి పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. ఈ తరుణంలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ప్రారంభమయింది.
అదే సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అయితే.. ఓ స్థానిక సంస్థ ప్రచానికి ప్రధాని స్థాయి నేత రావడం అరుదు. దానికి తగ్గట్లుగానే మోదీ పర్యటన గ్రేటర్ ప్రచారం కోసం కాదు. కానీ.. ఆయన పర్యటన ఖచ్చితంగా గ్రేటర్ ఓటర్లపై ప్రభావం చూపేలా ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధమయింది. మధ్యాహ్నం ప్రధాని మోదీ భారత్ బయోటెక్ ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. మీడియాతో మాట్లాడుతారో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన గంట మాత్రమే ఉండనుంది.
మరో వైపు బీజేపీ అగ్రనేతలు రోజుకొకరు చొప్పున పర్యటిస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజు వరకూ.., ఎవరో ఒకరు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమిత్ షా కూడా రానున్నారు. మరో వైపు కేసీఆర్ ప్రచారసభతో టీఆర్ఎస్.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లినట్లుగా అవుతుంది. ప్రచార బరిలో.. అగ్రనేతలతో ప్రచారంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో జాతీయ స్థాయి నేతలెవరూ పాల్గొనడం లేదు. కేసీఆర్ పొలిటికల్ సభ… మోడీ అపొలిటికల్ టూర్ గ్రేటర్ ప్రచారాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్తున్నాయి.