తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వన్ మేన్ షో..! ఆయన కర్త కర్మ క్రియ అన్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వ వర్గాల్లోగానీ, మంత్రి వర్గంలోగానీ, పార్టీలోగానీ ఆయనే సుప్రీమ్. ఆయన మాటకి ఎదురు ఉండదు. ఆయన నిర్ణయానికి తిరుగుండదు. కేసీఆర్ గురించి తెలంగాణలో ఇదే ఇమేజ్ ఉంది. అయితే, అన్నింటినీ తన గ్రిప్ లో ఉంచుకుని కూడా ఒక విషయంలో కేసీఆర్ ఎందుకో వెనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతూ ఉండటం విశేషం. ఆ విషయం ఏంటంటే.. మంత్రి వర్గ విస్తరణ.
కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఎప్పటికప్పుడు కథనాలు వింటూనే ఉంటాం. కొప్పుల ఈశ్వర్ లాంటి వారికి త్వరలోనే ఛాన్స్ అంటూ వార్తలు చూస్తూనే ఉంటాం. ఇదే సమయంలో… కొంతమంది మంత్రుల తీరుపై కేసీఆర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనీ వింటున్నాం. పలువురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. కొందరు ఆమాత్యుల పేషీలు కూడా సీఎం చెప్పు చేతల్లోనే పనిచేస్తున్నాయి! ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షల్ని కూడా కేసీఆర్ నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. సో… మంత్రి వర్గంపై కేసీఆర్ కమాండ్ ఈ రేంజిలో ఉందనేది పైపైకి కనిపిస్తున్నా… విస్తరణ విషయం వచ్చేసరికి కేసీఆర్ మీనమేషాలు లెక్కిస్తున్నారనే చెప్పాలి.
పోనీ.. ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా అంటే, ఆ సంప్రదాయానికి ఆధ్యుడు ఆయనే! ఇంకోపక్క ఏపీలో వ్యతిరేకత వ్యక్తమౌతున్నా జంప్ జిలానీలకి మంత్రి పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా విస్తరణ ఉంటుందన్న కథనాలు మళ్లీ జోరందుకున్నాయి. కానీ, తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో.. విస్తరణపై కేసీఆర్ జంకుతున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మార్పులూ చేర్పుల వల్ల రాజకీయ సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉందని కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారని కొంతమంది అంటున్నారు.
విస్తరణ పేరుతో కొంతమందికి పదవులు తీసేసి… కొత్తవారికి ఛాన్సులు ఇస్తే తెరాసలో కొత్త గ్రూపులు పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన కొంతమంది అభిప్రాయపడుతున్నారట. కారణాలు ఏవైనా కావొచ్చు.. మంత్రి వర్గ విస్తరణకు కేసీఆర్ కాస్త భయపడుతున్నారనే సంకేతాలు ఆయన మాటల్లోనే ధ్వనిస్తున్నాయి. అయితే, పార్టీలో అంతర్గతంగా ఉన్న పరిస్థితి నెమ్మదిగా బహిర్గతం అవుతున్నట్టు భావించాలి.