దళితుల ఓటు బ్యాంక్ ను పూర్తిగా సొంతం చేసుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకు పడింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ దళిత ఉద్దారకుడు అనేలా కార్యక్రమాలను ఖరారు చేసారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ టాంక్బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు- సీఎం 2016లో ప్రకటించారు. ఇప్పటికి పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు ప్రారంభిస్తున్నారు. విగ్రహం వల్లనే దళితులకు సాధికారిత వస్తుందా అన్న ప్రశ్నలు వినిపించకుండా రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించుకుంటున్నామని… సచివాలయానికి కూడా పేరు పెట్టామని చెబుతున్నారు.
ఇక దళితులకు పెద్ద ఎత్తున పథకాలు ఇస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై దళితుల్లో కొంత అసంతృప్తి ఉంది. దళిత ముఖ్యమంత్రి అనే దగ్గర్నుంచి అనేక హామీలు నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. వాటిని తిప్పికొట్టడానికిదళిత బంధు ప్రవేశ పెట్టారు కానీ.. అది చాలా తక్కువ మందికి అందుతోంది. ఇప్పుడు విగ్రహం పెట్టి.. దళిత ఉద్దారకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేసుకుంటోంది.