తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ రాజకీయాల్లో డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ వైపు బీజేపీకి దగ్గర అన్నట్లుగా కనిపిస్తూనే కాంగ్రెస్ పార్టీ విందు భేటీలకు హాజరవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్.. ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం ఎజెండా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎలా సమైక్యం కావాలన్నదే. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు హాజరైతే పెద్ద విశేషం లేదు కానీ… టీఆర్ఎస్ కూడా హాజరైంది. దీంతో ఢిల్లీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ప్రారంభమయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీతో రణమేనని నినాదం చేశారు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలందర్నీ కలిసి తెల్లజెండా ఎగురవేశారు. తర్వాత రణం లేదు రాజీ లేదు అని ప్రకటించారు. కానీ ఎక్కువగా రాజీ పడుతున్నారు.
అయితే ఆయన వ్యూహాత్మకంగానే అలా వ్యవహరించారని అప్పటి వరకూ దూకుడుగా వెళ్లిన బీజేపీకి కేసీఆర్ వ్యూహంతో బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరవడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరవాత కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీని కూడా గందరోగళంలో పడేయానికి ఇలాంటి సమావేశాలను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో ప్రారంభమైయింది. నిజానికి ఢిల్లీలో కపిల్ సిబల్ నిర్వహించిన విందు భేటీకి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఉందో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయనకు… ఇటీవలి కాలంలో… హైకమాండ్‌తో గ్యాప్ పెరిగింది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీని ఓడించడానికని బీజేపీయేతర పార్టీలతో సమావేశం నిర్వహించడం … దానికి టీఆర్ఎస్ హాజరు కావడం చాలా మందికి అర్థం కాని రాజకీయ సమీకరణంగా మారింది. కానీ తెలంగాణలో పరిస్థితులు.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు తెలిసిన వారు మాత్రం… జాతీయ పార్టీలను ఎలా గందరగోళంలో పడేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని అంటున్నారు.
బీజేపీ ఊపు మీద ఉన్నప్పుడు ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు.. కాంగ్రెస్ రేసులోకి వస్తే ఆ పార్టీకి దగ్గరయినట్లుగా సంకేతాలు పంపితే… తెలంగాణలో ఆ రెండు పార్టీల నేతలు చల్లబడిపోతారని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై ఈ అస్త్రం విజయవంతమయింది. బీజేపీలో చేరే ముందు ఈటల … ఇదే అంశంపై తన అనుమానాన్ని బీజేపీ హైకమాండ్ వద్ద వ్యక్తం చేయడమే ఈ స్కెచ్ హైలెట్ అయిందని చెప్పుకోవడానికి సాక్ష్యం. ఇప్పుడు అదే వ్యూహాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేలా కొన్ని కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొంటే… ఖచ్చితంగా అదే ప్లాన్ అని అంచనా వేసుకోవచ్చంటున్నారు. అదే జరిగిదే… ఆ సిట్యూయేషన్‌ను ఫేస్ చేయడం.. పీసీసీ చీఫ్ రేవంత్‌కు చాలా పెద్ద టాస్కెనని అనుకోవచ్చు.