కేసీఆర్ అంటే అంతే. ఓ సారి ఎవరిపైనైనా ఆగ్రహాన్ని అసంతృప్తిని పెంచుకుంటే మరోసారి అంత తేలికగా మనసు మార్చుకోరు. చినజీయర్ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో ముచ్చింతల్ వైపు చూడలేదు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా సర్వం సిద్ధమవుతున్న ఆలయం విషయంలోనూ ఆయనకు పాత్ర లేకుండా చేస్తున్నారు. యాదాద్రి ఆయన పునంప్రారంభం సందర్భంగా నిర్వహించాలని నిర్ణయించిన నారసింహా మహా సుదర్శనయాగం ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చినజీయర్ విషయంలో అసంతృప్తికి గురి కాక ముందు ఉంటే పది రోజుల కిందటే కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు కార్యక్రమాలుచేయాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలను ఆహ్వానించారు. మహా సుదర్శన యాగంలో 10వేల మంది రుత్విజులు పాల్గొనేలా ప్లాన్ చేారు.ఈ కార్యక్రమం కూడా చినజీయర్ చేతుల మీదుగానే సాగాల్సి ఉంది. కానీ హఠాత్తుగా ఏర్పాట్లన్నీ ఆపేశారు. యాగాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఆలయాభివృద్ధిలో బాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదాకు అధికారులు కారణం చెబుతున్నారు. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28న ప్రారంభమవుతుందని ప్రకటించారు. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. కట్టడాలు పూర్తి కాలేదని పది రోజుల కిందట తెలియదా అనే సందేహం అందరికీ వస్తుంది.అయితే వాయిదాకు చెప్పిన కారణం అసలు కారణం కాదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.