పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని 80 వేల క్యూసెక్కులకు విస్తరిస్తామని ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారు. రాయలసీమ పర్యటనలో అదే చెప్పారు. దీంతో.. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై కేసీఆర్ స్పందించాలని.. అక్కడి విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో చెన్నై నగరానికి 1500 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని నిర్మించారు. తర్వాత రాయలసీమ నీటి అవసరాల కోసం.. సామర్థ్యాన్ని పెంచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు దీని సామర్ధ్యాన్ని 44వేల క్యూసెక్కుల కు పెంచి గాలేరు నగరి,హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల కు దాదాపు 90 టీఎంసీలు తరలిస్తున్నారు.
వాస్తవంగా అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రమే నీటిని తరలించాలి.అంటే శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడుకు నీళ్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ,శ్రీశైలంలో 854 అడుగుల వద్దకు రాగానే నీరు తరలించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని నిర్మించారు. దీని సామర్ధ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచితే తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందని అక్కడి పార్టీలు అంటున్నాయి. జగన్ చెప్పినట్లుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే అదనంగా మరో వంద టీఎంసీలు తరలించే వీలు ఉంటుంది. దీంతో దీనిపై ఆధారపడ్డ పాలమూరు ఎత్తిపోతల,కల్వకుర్తి,భీమా, నెట్టెంపాడు,ప్రాజెక్టు లకు నీరే రాదన్న ఆందోళన అక్కడి ప్రజల్లో ఏర్పడుతోంది.
మామూలుగా అయితే ఇలాంటి ప్రకటనలు ఏపీ సీఎం నుంచి వస్తే కేసీఆర్ ఒంటి కాలుపై లేస్తారు. కానీ కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులపై పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. కానీ కొద్ది రోజుల కిందట.. కాళేశ్వరానికి వ్యతిరేకం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 80 వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్తామంటున్నారు. ఎన్నికల ముందు జరిగిన పరిణామాల వల్ల కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు.