దేశంలో కరెంట్ ఉంటే వార్త….తెలంగాణలో కరెంట్ పోతే వార్త. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీఆఎస్ కు అధికారం ఇస్తే.. దేశం మొత్తం ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అని.. కేసీఆర్ మైక్ పట్టుకున్న ప్రతీ సారి చెబుతూ వస్తూంటారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ కు తాము స్వయం సమృద్ధి సాధించామన్న నమ్మకం ఉంది. అయితే ఇలా విద్యుత్ ను ప్లస్ గా చూపిస్తూ… ప్రజల దగ్గరకు వెళ్తున్న సమయంలోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడటంతో ఇరవై నాలుగు గంటల విద్యుత్ నిలిపివేశారు. త్రీ ఫేస్ విద్యుత్ ను అసలు వ్యవసాయ మోటార్లకు పంపిణీ చేయడం ఆపేశారు. సింగిల్ ఫేస్ ఇస్తున్నారు. ఇది కూడా నాలుగు గంటలకు మించి ఉండటం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో అన్ని వైపుల నుంచి ఇలా విద్యుత్ కోసం రోడ్డెక్కిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అర్థరాత్రుళ్లు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని విపక్షాలు ఎందుకు వదిలి పెడతాయి ? వారు అసెంబ్లీ వరకూ తీసుకు వచ్చారు.
రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని.. రోడ్లను బ్లాక్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరెంట్ డిమాండ్ పెరుగుతూండటం… బయట నుంచి కొనడం తగ్గించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే.. సమ్మర్ లో మరిన్ని తీవ్రమైన కష్టాలను తెలంగాణ ప్రజలు పడాల్సి ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి.