తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యవసాయంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ, సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న సమగ్ర అవగాహన గురించి అందరికీ తెలిసిందే. ఆయనకి వ్యవసాయంపై అంత ఆసక్తి కలిగి ఉండటం తెలంగాణా రైతన్నల అదృష్టమేనని చెప్పక తప్పదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, దాని కోసం మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్దరణ, చిరకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పనిచేయడం మొదలుపెట్టారు. సాగునీటి ప్రాజెక్టులపట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ద, అవగాహన ఈరోజు శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మరోమారు బయటపడింది. ఆయన ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో కట్టిన ప్రాజెక్టుల గురించి కూడా సోదాహరణంగా వివరించి వాటివలన దిగువనున్న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏవిధంగా నష్టపోతాయో చెప్పిన తీరు అద్భుతం. అలాగే తెలంగాణాలో కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి, వాటిలో రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని దుమ్ముగూడెం-టేల్పాండ్ ప్రాజెక్టు, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్న వివిధ ప్రాజెక్టులు, చెరువుల గురించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలకు చాలా చక్కగా విడమరించి చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రా పాలకులు వివిధ ప్రాజెక్టులకు చేసిన నష్టాన్ని వాటి ఫలితాలను కూడా కేసీఆర్ వివరించారు. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా అవతరించినా, నేటికీ తెలంగాణా నేతలే కొందరు రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణాలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని కేసీఆర్ చెప్పారు.