నాలుగేళ్ల కిందట (2012) మా అబ్బాయి వివాహానికి ఆహ్వానించేందుకు (తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు) కె.చంద్రశేఖర రావును వెళ్లినప్పుడే ఆయన దాదాపు రెండు గంటలు మాట్లాడితే ఎక్కువ సమయం ప్రాజెక్టుల వివరాలు ప్రస్తావించారు. పుచ్చలపల్లి సుందరయ్య నదీజలాలపై రాసిన విషయాలను మెచ్చుకున్నారు. ఇక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి మీడియా ప్రముఖులతో కలసిన సందర్భంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోగా కూడా మిగిలేన్ని నీళ్లు వున్నాయని గట్టిగా చెప్పారు. ఆరు నెలల కింది వరకూ సీనియర్ పాత్రికేయులు రాజకీయ నాయకులు ఎవరు ఆయనను కలసినా నదీజలాలపై సుదీర్ఘంగా వివరించారని ఒకే అనుభవం చెబుతుండేవారు. నిజంగానే కెసిఆర్ గురించి బాగా తెలిసిన వారికీ, దగ్గర నుంచి విన్న వారికి ఆయన నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టు,పట్టుదల కలిగి వుంటారో మొదటి నుంచి తెలుసు. అందువల్ల శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తడుముకోకుండా ఇవ్వడంలో ఏ మాత్రం ఆశ్చర్యం కాదు. ఆయనను చాలా అభిమానించే ఒక తెలంగాణ పత్రిక సంపాదకుడు ఈ విషయమై ఎంతగానో ప్రశంసలు కురిపిస్తూ రాశారు కూడా. కనుక ఆయన చాలా కాలంగా వ్యక్తిగతంగానూ వ్యవస్థాగతంగానూ ఈ కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా చూస్తే పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ఈ విషయాలను వివరంగా నిర్ధారించడం తప్ప నూతనంగా ఏదో ఆవిష్కరించారని చెప్పడానికి లేదు కూడా. ఇదేదో బ్రహ్మ పదార్థం కాదు అని ఆయన మొదటే అన్నారు.
సభలో పవర్ పాయింట్ ఇవ్వడంపై కాంగ్రెస్ వివాదం లేవనెత్తడంలో అర్థమేమీ లేదు. ఎందుకంటే అది రూపానికి సంబంధించిన సమస్య తప్ప సారంలో తేడా ఏముంటుంది? పైగా లిఖితపూర్వకమైన ప్రతులు ఎలాగూ వస్తాయి. బహుశా గతానికి సంబంధించిన పొరబాట్లకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందనే కాంగ్రెస్ టిడిపిలు హాజరు కాలేదని అనుకోవాలి.
చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు
- తెలంగాణ పట్ల వివక్షతో అక్కడ నిర్మించాల్సిన ప్రాజెక్టులను పొరుగు రాష్ట్రాలతో వివాద గ్రస్తం చేయడం లేదా పర్యావరణ సమస్యలు సృష్టించడం చేశారు.
- గత ప్రభుత్వాలు లేదా సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంకారణంగానే నీటిని సరిగా వినియోగించుకోలేకపోయాము.
- దిగువన పూర్తి చేసుకున్నదానిలో చూసిన శ్రద్ద హడావుడి ఎగువన తెలంగాణ విషయంలో చూపలేదు
- ఖమ్మం వంటి చోట్ల సీమాంధ్రకు ఉద్దేశించిన ప్రాజెక్టులను కూడా తెలంగాణ కోసం చేస్తున్నట్టుగా చిత్రించారు.
- ఎగువన వున్న మహారాష్ట్ర గోదావరిపైన, కర్ణాటక కృష్ణపైన నలభై ఏభై బ్యారేజీలు కట్టి ఎత్తిపోతలు పెట్టి నీటిని దిగువకు రానీకుండా బిగపడుతున్నా మిన్నకుండిపోయారు.
- బాబ్లీపై పోరాడిన యోధుల్లా చెప్పుకున్నారే గాని ఆ పైన అలాటివి మరో నలభై వరకూ వున్నాయన్నది పట్టించుకోలేదు.
- జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి తలాతోకలేకుండా కాంట్రాక్టర్ల లబ్ది మేరకు పనులు నడిపి వేల కోట్లు వెచ్చించారు.
- ప్రాణహిత చేవెళ్ల బదులు కాళేశ్వరం, ఖమ్మంలో సీతారామ సాగర్, పాలమూరు ఎత్తిపోతల ఇవి ఆయన ప్రధానంగా చేసిన మూడు కొత్త ప్రతిపాదనలు.
- ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని వస్తే అది తాము ఎప్పుడో కుదుర్చుకున్నదేనని గొప్పలు చెబుతున్నారు. అయితే ఎందుకు కట్టలేదు?
- ఉన్నంతలో వివాద రహితంగానూ ప్రయోజనకరంగానూ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసుకుని ఎక్కువ నీళ్లు వుండేలా నిర్మించుకోవడం తప్ప మరో మార్గం లేదు.
- గతంతో పోలిస్తే ఖర్చులు పెరగడం,నీటి లభ్యత పెంచడం వల్ల 74 వేల కోట్ల వరకూ అవుతుంది గాని అప్పటికి కాళ్లేశ్వరం మొదటి దశే పూర్తవుతుంది. మిగిలిన దానికి మరిన్ని వేల కోట్లు వెచ్చించి మరింత కాలం పనిచేయవలసి వుంటుంది.
- ప్రాణహిత చేవెళ్ల వల్ల మహారాష్ట్రలో అధికంగా ముంపువుండటం వల్ల ఒప్పుకోవడం జరగదు. అదే మేడిగడ్డ వద్ద కడితే నీటి లభ్యత కూడా అధికంగా వుంటుంది. కట్టని ప్రాజెక్టుకు అధిక ఎత్తు సాధించామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదం. మేడిగడ్డ తర్వాత ఇంకా దిగువకు వస్తే నీటి లభ్యత మరింత వుంటుంది.
- పనికి మాలిన కాంట్రాక్టర్లను నియమించడం వల్లనే మిడ్ మానేరు వంటివి పూర్తి కాలేదు.ఇప్పుడు వారికి ఒప్పందం మేరకు పనులు అప్పగించి ప్రధానమైనవి తప్పించేస్తాం.
- కృష్ణలో నీరు లేకపోవడం రాష్ట్రాలు కలహించుకోవడం కంటే అత్యధికంగా నీరున్న గోదావరిని ఉపయోగించుకోవడం శాస్త్రీయమైన పద్ధతి.
- మన నిధులు మన చేతికి వచ్చాయి. నియామకాలు చేస్తున్నాం. ఇక నీళ్ల సంగతి చేపడతాం.
- కోటి ఎకరాలకు పైన తెలంగాణలో నీటి సదుపాయం కల్పించడం తథ్యం.
- ఆ కోణంలో పట్టిసీమను కూడా అభినందనలు. స్వయంగా చొరవ తీసుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సదవగాహనతో ముందుకుపోతాము.
వచ్చిన విమర్శలు, మిగిలిన ప్రశ్నలు…
కొన్ని నిశితమైన రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు కూడా జోడించిన కెసిఆర్ ప్రసంగంలో నొక్కి చెప్పిన విషయాలివి. అయితే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు, నీటిపారుదల నిపుణులు, కొంతమంది ఎపి నాయకులు లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు-
- మేడిగడ్డ దగ్గర అధిక నీటి లభ్యత నిజమే కావచ్చు గాని పైన పూర్తి చేసుకోవడం వల్ల త్వరగా పూర్తయి అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత కింద కూడా కావాలంటే కట్టుకోవచ్చు. ఇప్పటి వరకూ చేసిన వ్యయాన్ని వ్యర్థం చేసుకోవడం, నిర్మాణంలో జాప్యం వల్ల నష్టపోవడం ఎందుకు?
- ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం బ్యారేజీలు నిర్మిస్తున్న విషయం కొత్తగా తెలిసిందా? లెక్కలో తేడాలున్నా స్పష్టంగా తెలిసిందే కదా?
- ఇంత పెద్ద కసరత్తు చేస్తున్నప్పుడు ముందే ఎందుకు అఖిలపక్షంతో చర్చించలేదు? మీ ఆలోచనల మేరకు అన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు ఏకపక్షంగా ప్రెజంటేషన్ ఇస్తే సరిపోతుందా?
- ఎపికి ఏడు మండలాల బదలాయింపుపై అప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? ఇప్పుడు అవి తిరిగి ఇస్తారని చెప్పేమాటలకు ఆధారమేమిటి?
- కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవాటిపై ఎందుకు మాట్లాడలేదు? అవి కొనసాగిస్తారా లేదా?
- అదిలాబాద్ మహబూబ్‌నగర్ వంటి చోట్లగాని ఖమ్మంలో గాని గిరిజన ప్రధానమైన ప్రాంతాల్లో గాని ప్రాజెక్టులు త్వరితంగా పూర్తి చేస్తారా లేదా?
- ఎత్తిపోతలకు భారీగా విద్యుత్ అవసరం గనక ఏడాదికి 15వేల కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారు? అంత భరించగలమా?
- వివక్ష, నిర్లక్ష్యం వంటి ఆరోపణలు వేరే గాని కావాలని పై రాష్ట్రాలద్వారా వివాదం పెట్టించారనేది కొంచెం విపరీతంగా వుంది.
- కర్ణాటక మహారాష్ట్రలు కట్టిన బ్యారేజీల వల్ల నీటి సరఫరా ఆగినట్టే ఇప్పుడు తెలంగాణ కట్టే వాటి వల్ల ఎపికి ఇబ్బంది కలగదా?
- పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారా? ప్రాణహిత చేవెళ్ల విషయంలో రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న అసంతృప్తిని అభద్రతను ఎలా తొలగిస్తారు?
తక్షణ సమాధానాలు..ఈ ప్రశ్నలలో కొన్నిటికి ముఖ్యమంత్రి సూటిగా వివరంగా సమాధానమిచ్చారు. కొన్నిటికి తర్వాత వివరాలు రావచ్చనుకోవాలి.
- పారదర్శకత పాటిస్తాం
- వివక్షకు సంబంధించి చాలా ఆశ్చర్యకరమైన వాస్తవ వివరాలు వున్నాయి.
- మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటన ఏకపక్షంగా వుందంటూ అప్పటి ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ అధికారికంగా లేఖ రాశారు.
- ఇప్పుడు పెండింగులో వున్న ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తాం. ఒక్కటి మాత్రం 2019 వరకూ నడవొచ్చు.
- రంగారెడ్డికి నీటి లభ్యత లేని మాట నిజమే.అయితే అది కృష్ణా బేసిన్లో వుంది. ఏ బేసిన్లో ప్రాజెక్టులకు అక్కడే నీటిని సాధించుకోవడం ఒక సూత్రంగా పెట్టుకోవాలి. కృష్ణా ట్రిబ్యునల్ విషయమై విడిగా పోరాడుతున్నాం. దాని పర్యవసనాలు చూశాక నిర్ణయం తీసుకోవచ్చు.
- ఎపి మహారాష్ట్రలలోనూ కేంద్రంలోనూ కాంగ్రెసే వున్నప్పుడు కూడా పరిష్కారం చేయని వాళ్లు ఇప్పుడు ఏవో విమర్శలు చేయడం అర్థరహితం.
- మొత్తంపైన కెసిఆర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌కు అభినందనలే అత్యధికంగా వచ్చాయి. ఎపి నుంచి కూడా చాలామంది ఫోన్లు చేశారని ఆయన చెప్పారు. పెన్‌డ్రైవ్‌లో ఈ పవర్ పాయింట్ అందరికీ సరఫరా చేశారు. సభ వాయిదా పడింది గనక దీనిపై చర్చ మరో సారి జరగొచ్చు. ఇక్కడ చెప్పుకున్న వాటిలోనూ సాంకేతికమైన పొరబాట్లు వివరాల్లో తేడాలు వుంటే సరిదిద్దుకోవలసిందే.