తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని చంద్రబాబు అన్న మాటలను.. తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. చంద్రబాబు మాటలను పటాన్ చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని చంద్రబాబు ఓ మీటింగ్‌లో అన్నారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదుల సంఖ్యలో ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించారు.
అయితే చంద్రబాబు ఇలా మాట్లాడటాన్ని .. బీఆర్ఎస్ ఆస్థాన పత్రిక నమస్తే తెలంగాణ వ్యతిరేకించింది. తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబు ఎప్పుడూ సానుకూలత లేదని.. ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాడుకున్నారని పెద్ద కథనం రాసింది. నిజానికి ఇవే మాటలు కేసీఆర్ గతంలో చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఏ సమావేశం జరిగినా ఈ మాటలు చెబుతూ ఉంటారు.అయితే చంద్రబాబే చెప్పారు కాబట్టి ఈ సారి మరింత గొప్పగా చెప్పారు.
హైదరాబాద్ చుట్టుపక్కన భూముల ధరల విషయంలో .. ఏపీ ఎక్కడో ఉంటుంది. ఒకప్పుడు గుంటూరు, విజయవాడల్లో ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లు పలికే భూములు.. ఇప్పుడు.. ఎంతో పెరిగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ దాటి ముఫ్పై కిలోమీటర్ల వరకూ రియల్ వెంచర్లు పడ్డాయి. ఔటర్‌కు దగ్గరలో ఓ మోస్తరు సౌకర్యాలున్న ఇల్లు కనీసం రూ. కోటి ఉంటోంది. కానీ ఏపీలో సంపద విలువ మాత్రం దారుణంగా పడిపోయింది.