తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పనికి మాలిన విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్లీనరీ వేదికగా ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు అందరూ అవే విమర్శలు చేశారు. అదే సమయంలో తమ పాలనలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. దీనికి సాక్ష్యంగా కేంద్రం ఇచ్చే అవార్డులనేచెప్పారు కేసీఆర్. తెలంగాణలో కేంద్రం అవార్డులు సాధించని ఒక్క శాఖ కూడా లేదన్నారు. అన్ని అవార్డులు తెలంగాణకే వస్తున్నాయన్నారు.
నిన్నటికి నిన్న దేశంలో తెలంగాణలో అత్యంత మెరుగైన గ్రామాలను ఇరవై ఎంపిక చేస్తే వాటిలో పందొమ్మిది తెలంగాణవే ఉన్నారు. అయితే… తెలంగాణ ఎంతో మెరుగైన పాలన అందిస్తుందని చెప్పడానికి కేసీఆర్ కానీ.. టీఆర్ఎస్ నేతలు కానీ.. తాము పనికి మాలినదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ అవార్డులనే చూపించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. తమకు అనుకూలంగా ఉంటే తీసుకోవడం లేకపోతే.. విమర్శించడం అనే రాజకీయాన్ని టీఆర్ఎస్ చేస్తోందని బీజేపీ నేతలుకూడా విమర్శిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిపాలన నచ్చనప్పుడు కేంద్రం ఇచ్చే అవార్డుల కూడా తీసుకోవద్దని … వాటిని కూడా తిరస్కరించాలంటున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యున్నతమైనందని.. ఈ విషయం కేంద్రం విడుదల చేస్తున్న రిపోర్టులు… రికార్డుల్లోనే ఉందని.. ప్రచారం చేసుకుంటున్నారు.