హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నారాయణఖేడ్ ఉపఎన్నిక ప్రచారసభలో పాల్గొన్నారు. సభకు పెద్దసంఖ్యలో పోటెత్తిన జనాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తూ ఇంత భారీ సభ నారాయణఖేడ్ చరిత్రలో ముందెన్నడూ జరగలేదు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలన్నింటినీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా, నారాయణఖేడ్ ప్రచార బాధ్యతలను చూస్తున్న మంత్రి హరీష్‌రావును ఆకాశానికెత్తారు. హరీష్ రావు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాడని, శక్తి ఉన్న యువకుడని అన్నారు. నారాయణఖేడ్‌ను నూరుశాతం సిద్దిపేటలాగా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడని చెప్పారు. నారాయణఖేడ్ బాగా వెనకబడిఉందని, చూస్తుంటే గుండెలవిసిపోయాయని హరీష్ అన్నాడని తెలిపారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల కాళ్ళు కడుగుతానని చెప్పారు. వరంగల్, హైదరాబాద్‌లలో ఇచ్చిన తీర్పును ఇక్కడ కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నికల తర్వాత కూడా ఇక్కడకు వచ్చి రెండు రోజులు పర్యటించి సమస్యలన్నీ తెలుసుకుంటానని, ఖేడ్‌ను తప్పనిసరిగా అభివృధ్ధి చేయటం తన బాధ్యత అన్నారు. కేసీఆర్ మొండి ఘటమని చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినపుడు, ఈ బక్కాడు ఏం చేస్తాడని అందరూ అన్నారని గుర్తు చేశారు. నారాయణఖేడ్‌లో ఒక మార్కెట్ కమిటీగానీ, ఆసుపత్రిగానీ లేకుండా గత పాలకులు పాలించారని చెప్పారు.