అవునా.. హరీష్‌రావు.. తన మామయ్య కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాల్మొక్తా అన్నాడా? ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? ఏదో మామయ్య గనుక.. గౌరవంగా కాల్మొక్కడం సంగతి వేరు.. కానీ బహిరంగసభ లో ప్రసంగంలో భాగంగా.. అలాంటి కాల్మొక్కడం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది? మరే ఇతర కారణాలకోసం, ఎలాంటి కోరికలకోసం హరీష్‌రావు, మామయ్య కాల్మొక్తానన్నాడు? ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి? హరీష్ అలా తనతో అన్నాడంటూ స్వయంగా కేసీఆరే అన్నారు. అయితే.. ఆ కోరిక నారాయణ ఖేడ్ అభివృద్ధి గురించిట! బుధవారం నాడు నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్.. హరీష్‌రావును పొగడ్తలతో ముంచెత్తడంలో భాగంగా.. ఈ విషయం కూడా చెప్పారు. ‘హరీష్ నా కాల్మొక్త అన్నాడు… అంత అవసరం లేదు. ఆయన పడుతున్న కష్టానికి తగినట్టుగా.. ఆయన కోరుకుంటున్నట్టుగా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా లేకుండా.. తెరాస అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టండి. నేనే గోదావరి నీళ్లు తీసుకువచ్చి మీ అందరి కాళ్లు కడుగుతా’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన బహిరంగసభలో అన్నారు.
ఈ కార్యక్రమంలో కేసీఆర్ హరీష్‌రావును పొగడ్తలతో ముంచెత్తారు. మీ జిల్లా మంత్రి ఉన్నాడు.. బుల్లెట్లా దూసుకుపోయే అద్భుతమైన మంత్రి మీకున్నాడు. నాలుగునెలలుగా మీకోసం పాటు పడుతున్నాడు. మీ కష్టాల్ని చూస్తున్నడు అంటూ జనం చప్పట్లు కొడుతుండగా హరీష్‌ను కేసీఆర్ ఆకాశానికెత్తేశారు. హరీష్‌రావు ద్వారానే మీ మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని సాకారం చేస్తామని ఆయన అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఎన్నేళ్లు పాలించినా.. ఇప్పటిదాకా నారాయణఖేడ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకుండా ఉండిపోయిందని.. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా.. ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచార సభ గనుక జనాన్ని మెప్పించేందుకు ప్రచారానికి వచ్చిన నేతలు రకరకారల మాటలు చెప్పడం మామూలే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకించి హరీష్‌రావును విపరీతంగా పొగడడానికి రాజకీయ ప్రాధాన్యం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ఘనతను కొడుకు కేటీఆర్‌కు కట్టబెడుతూ.. ఆయనకు అదనపు శాఖలు అప్పగిస్తూ సత్కరించిన నేపథ్యంలో హరీష్‌లో అసంతృప్తి ఉన్నదని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్‌ను కూడా బుజ్జగించడానికి ఒక ప్రయత్నంగా ఇలా ఎడాపెడా పొగిడేశారని పలువురు అనుకుంటున్నారు.