భారతీయ జనతా పార్టీని “బద్మాష్” కేటగిరీలో చేర్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇటీవలి కాలంలో మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదని.. బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటారని అనుకుంటున్నారు. అయితే.. అనూహ్యంగా మోడీని పొగుడుతూ కేసీఆర్ ఓ లేఖ పంపారు. మోడీ అద్భుతమైన పని చేస్తున్నారని ప్రశసించారు. ఆ వ్యవసాయ చట్టాలు కాదు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం సరిపోవడం లేదని.. కొత్త భవనం కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రతిపాదించారు. దానికి పదో తేదీన అంటే.. గురువారం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేసీఆర్ మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూ లేఖ రాశారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్నిఇనుమడింప చేస్తుందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. అయితే.. బీజేపీతో తీవ్రమైన రాజకీయ విబేధాలు ఏర్పడిన సమయంలో.. కేసీఆర్ హఠాత్తుగా మోడీని పొగుడుతూ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నే రాజకీయవర్గాలను ఉత్కంఠలో ముంచెత్తుతోంది. ఆ ప్రాజెక్టుపై నిజానికి చాలా విమర్శలు ఉన్నాయి. దేశం ఆర్థిక పరమైన కష్టాల్లో ఉన్నప్పుడు.. వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఈ భవనం నిర్మాణం ఎందుకన్న చర్చ కూడా నడుస్తోంది. లక్షణంగా ఉన్న భవనాన్ని ఎందుకు నిరుపయోగం చేయాలనుకుంటున్నారన్న చర్చ కూడా వస్తోంది. అయినాకేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. కొత్త సచివాలయాన్ని కట్టాలనుకున్నారు. పాత సచివాలయాన్ని నేల మట్టంచేశారు. ప్రస్తుతం ఆ పనులు టెండర్లకు పూర్తయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. తన తరహాలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నందున.. మోడీకి శుభాకాంక్షలు చెప్పారని కొంత మంది అనుకుంటున్నారు. అయితే.. మోడీ చేసిన పని మంచిదైనా.. ప్రస్తుతానికి బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయలేని.. రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు. మోడీని వ్యతిరేకించాల్సిన పరిస్థితులో ఉన్నారు . ఆయనపై దేశవ్యాప్త పోరాటం చేస్తానని ప్రకటించండమే దీనికి కారణం. అయితే.. కేసీఆర్ రాజకీయ వ్యూహంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం.. ఈ లేఖ ద్వారా కొందరిలో వ్యక్తమవుతోంది. రాజకీయ చాణక్యుడైన కేసీఆర్… ఏం చేసినా.. దానికో లెక్క ఉంటుంది. మోడీకి పొగడ్తల వెనుక అసలు లెక్కలేమిటో.. ఆయన రాజకీయ నిర్ణయాల ద్వారానే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.