ఎన్నికలకు ఓ అధికార పార్టీ ఎలా సిద్ధమవ్వాలో అలా సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేసేశారు. మిగిలిపోయిన ఇతర బదిలీలు పూర్తి చేశారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఇతర పనులు ఆగకుండా రిక్రూట్ మెంట్లు.. ఇతర పనులు చక్కబెట్టారు. ఇక మిగిలిపోయిన కొన్ని హామీలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించబోతున్నారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. కార్యాచరణ ప్రకటించిన తర్వాత అసలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ లో పదిహేడో తేదీన బహిరంగసభ ఉంది. ఆ తర్వాత పది రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. కానీ బయటకు రానివ్వలేదు. గతంలో ఇలాంటి కసరత్తులో ఐ ప్యాక్ కు చోటు కల్పించడంతో వివరాలు లీక్ అయ్యాయి. దాంతో కేసీఆర్ ఐ ప్యాక్ ను దూరం పెట్టారు. తర్వాత సీక్రెట్ గానే కసరత్తు సాగిపోయింది.
ప్రస్తుతం ఎన్నికలకు కేసీఆర్ మాత్రమే సిద్ధమయ్యారు. ఇతర పార్టీలేవీ ఇంకా రెడీ కాలేదు. బీజేపీకి అభ్యర్థుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ముఖ్య నేతలు ఉన్న చోట్ల మాత్రమే గట్టిపోటీ ఇస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఇంకా గాడిన పడలేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రత్యర్థులు కత్తి, డాలు అందుకోక ముందే కేసీఆర్ యుద్ధం పూర్తి చేసి విజేతగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారన్న నమ్మకం గట్టిగా ఏర్పడుతోంది.