ముందస్తు ఎన్నికలు వస్తాయా, జమిలి ఎన్నికలే వస్తాయా అనే చర్చ ఒకపక్క దేశవ్యాప్తంగా జరుగుతోంది. అదెలా ఉన్నా, తెలంగాణలో మాత్రం పూర్తిస్థాయి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ప్రతిపక్షాలూ హడావుడిగా ఉన్నాయి. అంతకంటే అధికార పక్షం తెరాస హడావుడే కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో మరోసారి తెరాస అధికారంలోకి వస్తుందనీ, కేసీఆర్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక ప్రాథమిక అంచనా సర్వత్రా ఉన్నా… అలాంటి ధీమాతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా లేరు! అంటే, ప్రతిపక్షాలూ అనూహ్యంగా బలపడుతున్నాయనో, లేదంటే తెరాసకు ప్రతికూల పరిస్థితులు వస్తాయనో అభిప్రాయం కేసీఆర్ కీ లేదనే చెప్పాలి. కానీ, గెలుపు ధీమాని పార్టీ శ్రేణుల్లోకి ఏకోశానా రానీయకుండా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.
తెరాస ఎమ్మెల్యేల తీరుపై ఇప్పటికే మూడుసార్లు సర్వేలు చేయించారు కేసీఆర్. నాలుగో సర్వే కూడా ఇటీవలే అయింది.ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చెయ్యలేని ఎమ్మెల్యేల విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. పనితీరులో కిందస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కౌన్సిలింగులు లాంటివి నడుస్తున్నట్టు సమాచారం! ఇక, ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. నియోజక వర్గాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. పనిలోపనిగా ప్రతిపక్ష పార్టీల పరిస్థితులను కూడా నియోజక వర్గాల వారీగా కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు, పార్టీ నుంచి ఎలాంటి సాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగాలంటూ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.
అయితే, కేసీఆర్ నుంచి ఫోన్లు రాని కొంతమంది ఎమ్మెల్యేల్లో ఓ కొంత గుబులు మొదలైంది. సిట్టింగులందరికీ మరోసారి టిక్కెట్లు ఖాయమని సీఎం కేసీఆర్ ఒకటికి రెండుసార్లు ఇదివరకే చెప్పినా…. అంతిమంగా ఎన్నికలు వచ్చేసరికి పనితీరు మాత్రమే కొలమానం అవుతుందన్న సంకేతాలూ ఇస్తూనే వస్తున్నారు. దీంతో తాజాగా కేసీఆర్ ఫోన్ రాని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు అనుమానమే అనే చర్చ కూడా తెరాస శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
మొత్తానికి, ఎన్నికలకు సర్వసన్నద్దంగా ఉంటున్నారు కేసీఆర్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. తెరాస ఎమ్మెల్యేలు కాస్త అసంతృప్తిగా ఉన్నచోటా, లేదా బలహీనంగా ఉన్నచోట ఇతర పార్టీల నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే, మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కి అవకాశం ఉందన్నమాట. తెరాస బలపడటంతోపాటు, ప్రతిపక్షాలను బలహీనపరచడం కూడా తన ఎన్నికల వ్యూహంలో భాగంగా కేసీఆర్ అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. కేసీఆర్ పదేపదే చెబుతున్నట్టు 100కి పైగా స్థానాల్లో గెలిచి తీరాలన్న పట్టుదల బాగా కనిపిస్తోంది.