కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మన దగ్గరున్న సులువైన మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. లాక్ డౌన్ కి ప్రజలు సహకరిస్తున్నారనీ, లేకపోయుంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదన్నారు. ఒకే రోజున పది పాజిటివ్ కేసులు వచ్చాయనీ, మొత్తంగా మన దగ్గర 58 కేసులు ప్రస్తుతం ఉన్నాయనీ, ఒకరు చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయారన్నారు. 20 వేలమంది హోం క్వారంటైన్లో ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారన్నారు. లాక్ డౌన్ చేసి, కర్ఫ్యూ పెట్టినా ఒకే రోజున పది పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు వెంటిలేర్లకు ఇబ్బందులు వస్తున్నాయనీ, అలాంటి పరిస్థితి మన దగ్గర రాకూడదంటే సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గం అన్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్ స్థాయిలో మన దగ్గర వైరస్ వ్యాప్తి చెందితే… 20 కోట్ల మంది రోగం బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారని అన్నారు. అందుకే, ప్రజలకు చేతులు జోడించి చెబుతున్నా, మన స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్నారు.
పరిస్థితి ఏ స్థాయికి వెళ్లినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. 11 వేల మంది పేషెంట్లను ఐసోలేషన్ వార్డుల్లో పెట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నామన్నారు. 1400 క్రిటికల్ కేర్ బెడ్స్ రెడీ చేశామనీ, మొత్తంగా 12,400 మందిని పేషెంట్లుగా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని కేటగిరిల్లో దాదాపు 60 వేల పాజిటివ్ కేసులు తేలినా చికిత్స చేసేందుకు రాష్ట్రం రెడీగా ఉందన్నారు. వైద్యుల సంఖ్యను పెంచుకోవడం కోసం రిటైర్ అయిన డాక్టర్లు, ఎంబీబీఎస్ పూర్తి చేసి విద్యార్థులు ఇలా ఒక పూల్ తయారు చేసుకున్నామనీ, అవసరమైనప్పుడు వారి సేవల్ని వినియోగించుకుంటామన్నారు.
హాస్టల్ విద్యార్థులు గందరగోళ పడాల్సిన అవసరం లేదనీ, హాస్టళ్లు ముయ్యరని చెప్పారు. దీంతోపాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఆశ్రమాల్లో ఉంటున్న వృద్ధులు ఇలా ఏ ఒక్కర్నీ ఆకలితో ఉండనీయమనీ అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయన్నారు కేసీఆర్. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఇది పంట చేతికి వచ్చే కాలమనీ, అయినా సరే గ్రామాల్లో రైతులు అస్సలు ఆందోళన పడాల్సిన పనిలేదనీ, పంటల్ని కొనేందుకు ప్రభుత్వమే గ్రామాలకు వస్తుందన్నారు. రైతుబంధు సమితుల సభ్యులు గ్రామాల్లో కథానాయకులు కావాలన్నారు.
కరోనాను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగానే కృషి చేస్తున్నాయి. అయితే, దీనికి ప్రజల సాయమే ఇప్పుడు అత్యంత అవసరమైంది. అత్యవసరమైతే తప్ప, ఇంటి నుంచి బయటకి వెళ్లకూడదనే స్వీయ నియంత్రణ మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ స్థాయిలో సంసిద్ధమౌతున్నాయంటే, తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతోందనే అంచనా ప్రతీ ఒక్కరూ వేసుకోవాలి. ప్రజలంతా ఐకమత్యం ప్రదర్శిస్తే దీన్ని తమికొట్టడం కష్ట సాధ్యమైన పనైతే కాదు.