దేశంలో భవిష్యత్లో “ప్రజాఫ్రంట్” రావాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మరో రెండు గంటల పాటు ప్రెస్మీట్ పెట్టి నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. దేశానికి కొత్త రాజకీయ పార్టీ అవసరం అని ప్రజలు కోరుకుంటే .. పార్టీ పెడతానని ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నానని మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడానన్నారు. ఉద్దవ్ థాకరేతో త్వరలో భేటీ అవుతానని ప్రకటించారు. ప్రజాఫ్రంట్ కోసం కేసీఆర్ మరింత చురుకుగా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోంది.
తన ప్రెస్మీట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఫల్యాలపై కేసీఆర్ విస్తృతంగా మాట్లాడారు. స్వాతి చతుర్వేది అనే రచయిత రాసిన మోడీ పాలనలో దేశం ఎంత నష్టపోయిందో వివరంచే పుస్తకం చదవాలని చెబుతూ ప్రజలకు సలహా ఇస్తూ ప్రారంభించిన కేసీఆర్ కరెంట్ విషయంలో మోడీ సర్కార్ వైఖరి దగ్గర నుంచి సీబీఐ, ఈడీలను తమపై పంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించే వరకూ అనే అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. హ క్కుల కోసం పోరాడుతూంటే సీబీఐ, ఈడీని పంపి ఆగం చేస్తారని బెదిరిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని .. ఢిల్లీలో పంచాయతీ పెడతానని స్పష్టం చేసారు.
రాజ్యాంగంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంబేద్కర్ మహనీయుడని ఆయన గురించి తాను వ్యాఖ్యానించలేదన్నారు. అంబేద్కరే రాజ్యాంగాన్ని తగులబెట్టాలన్నారని గుర్తు చేశారు. దేశంలో దళితుల సంఖ్య 19 శాతానికి చేరిందని కానీ వారికి సమాన అవకాశాలు లభించడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ అసమానతలు తొలగించడానికే తాను రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు పథకం దేశం మొత్తం దళిత బంధు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు తెలియచేయలేదని స్పష్టం చేశారు. అసోం సీఎం రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను మాత్రమే ఖండించానన్నారు. వాటిని బీజేపీ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు.
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాల రాస్తోందనికేసీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను కూడా కాలరాస్తోందని రాజ్యాంగ ఉల్లంఘన పనులు చేస్తోందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మరో వైపు అత్యంత భారీగా నిర్వహించబోతున్న యాదాద్రి ఆయన పునంప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆలోచిస్తామన్నారు.