శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత. మాటల మరాఠీ కేసీఆర్‌కు ఇది తెలియని సంగతి అయి ఉండదు. అందుకే న్యాయపీఠం సూత్రప్రాయంగా ఒక మొట్టికాయ వేయగానే ఆయన అలర్ట్ అయిపోయారు. ప్రభుత్వం మొత్తం శరవేగంగా కదిలింది. తదుపరి విచారణ నాటికి ప్రభుత్వం చేసిన తప్పును.. న్యాయస్థానం తూర్పారపట్ట ముందే ఆ తప్పును దిద్దుకునేందుకు ప్రయత్నించేశారు. దిద్దుకోవడం అనగా.. దానిని మార్చేయడం అనుకుంటే పొరబాటే. తాము అనుకున్న లబ్ధి పొందడానికి ఏర్పాటుచేసుకున్న అడ్డదారికి.. ‘జీవో’ అనే ఒక ముసుగు తొలగించేసి.. ‘ఆర్డినెన్స్’ అనే కొత్త ముసుగును ఇప్పుడు తగిలించారు.
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలకైనా ఎక్స్ అఫీషియో సభ్యత్వం / ఓటుహక్కు కట్టబెట్టడంలో వెసులు బాటు ఇస్తూ తెచ్చిన జీవో 207 సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై కాంగ్రెసు నాయకుడు దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్ విచారణ పర్వం.. ఒక రకంగా ప్రభుత్వానికి చెమటలు పట్టించిందనే చెప్పాలి. బుధవారమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడగా, గురువారం వరకు సమయం తీసుకున్న ఏజీ న్యాయస్థానాన్ని మెప్పించలేకపోయారు. అదే సమయంలో.. అధ్యయనం ఇంకా జరగాలంటూ.. కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈలోగా తీర్పు ఎలా వస్తుందో సర్కారుకు అర్థమైపోయినట్లుంది. అందుకే.. ముందుజాగ్రత్తగా ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేసేసింది
(ఈ అంశంపై నేపథ్యం, అదనపు వివరాల కోసం తెలుగు360 డాట్ కాం అందించిన ‘కేసీఆర్ వ్యూహానికి హైకోర్టులో వ్యతిరేకత’, ‘రిజల్ట్ వచ్చినా మేయర్ ఎన్నికల్లో జాప్యమే’ వార్తలు చదవవచ్చు)
జీవో 207 వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కోర్టులో ఓటమి తప్పదని కేసీఆర్ సర్కారుకు అర్థమైపోయినట్లుంది. చట్టసవరణ విషయంలో జీవో ద్వారా చేసేయడం ఒంటెత్తు పోకడే అని.. విభజన చట్టం లోని సెక్షన్లను అడ్డుపెట్టుకోవడం చెల్లబోదని వారికి అర్థమైంది. దీంతో ముందే మేలుకున్న సర్కారు ఆ జీవో 207ను రద్దుచేసేసింది. అయితే ఆ జీవో ద్వారా తాము సంకల్పించిన అడ్డదారి రాజకీయ ప్రయోజనాలు ఏవీ భంగపడకుండా ఉండేలాగా కొత్తగా ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రంలోని ఎమ్మెల్సీలకు గ్రేటర్ నోటిఫికేషన్ సమయానికి హైద్రబాద్లో ఓటు ఉంటే చాలు, ఎక్స్ అఫీషియో సభ్యత్వం ఇవ్వచ్చునంటూ కొత్తగా ఆర్డినెన్స్ ముసాయిదా సిద్ధం చేశారు. కేబినెట్ సమావేశం లేకపోవడంతో సర్కులేషన్ పద్ధతిలో నగరంలో అందుబాటులో ఉన్న మంత్రులందరి ఇళ్లకు ముసాయిదా బిల్లు పంపి వారితో సంతకాలు చేయించి.. అనంతరం అధికారులు గవర్నరు ఇంటికి తీసుకువెళ్లి.. ఆయన ఆమోద ముద్ర వేయించారు. అంత అడ్డగోలుగా ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం జరిగింది. మొత్తానికి తాము అనుకున్నట్లుగా ప్రయోజనం పొందడంలో ఢోకా లేకుండా కేసీఆర్ సర్కారు చూసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.