ఉద్యోగులు 29 శాతం పీఆర్సీ ప్రకటనకే పాలాభిషేకాలు చేసిన ఉద్యోగ సంఘాలకు కేసీఆర్… నోరు తీపి చేశారు. ఒక శాతం ఎక్కువగానే పీఆర్సీ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. సాగర్ ఉపఎన్నిక నేపధ్యంలో ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ప్రకటన చేశారు. ముఫ్పై శాతం పీఆర్సీని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు. మామూలుగా అయితే గత పీఆర్సీ ముగిసిపోయిన తేదీ నుంచి.. అమలు చేస్తారు. కానీ కేసీఆర్ మాత్రం బకాయిలు లేకుండా చూసుకున్నారు. వచ్చే నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెద్దగా అభ్యంతర పెట్టడం పెట్టలేదు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు .. పాలాభిషేకాలు కూడా ప్రారంభించారు.
దీంతో పాటు ఉద్యోగ పదవీ విరమణ తేదీన 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్, హోంగార్డు, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఫిట్మెంట్ అమలు చేస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ గ్రాట్యూటీ పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింప చేస్తారు. తెలంగాణలో ఉన్న ఏపీ టీచర్లను స్వరాష్ట్రానికి వెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. ఈ పీఆర్సీ వల్ల తొమ్మిదిన్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతారు. అసలు పీఆర్సీ కోసం నియమించి బిశ్వాల్ కమిషన్ కేవసం ఏడు శాతం వేతన పెంపును సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుతో పోలిస్తే.. కేసీఆర్.. నాలుగు రెట్లపైనే పీఆర్సీ ప్రకటించారు.
పీఆర్సీ పెంపు వల్ల ప్రభుత్వంపై దాదాపుగా రూ. ఎనిమిది వేల కోట్లు భారం పడే అవకాశం ఉంది. ఆ మేరకు.. బడ్జెట్లో వివిధ పద్దతుల్లో… కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులను ఊరించి.. ఊరించి ప్రకటన చేయడంలో కేసీఆర్‌ది ప్రత్యేక శైలి. కేసీఆర్ .. పీఆర్సీ విషయంలోనూ అదే పద్దతి పాటించారు. బిశ్వాల్ కమిషన్ ఏడు శాతం సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కేసీఆర్… అంత తక్కువ ఇవ్వరని.. ఎంతో కొంత ఎక్కువే ఇస్తారని అనుకున్నారు. అనుకున్నట్లుగానే లీకులు ఇచ్చిన దాని కన్నా ఒక శాతం ఎక్కువే ఇచ్చారు. కేసీఆర్ మార్క్ ప్రకారం.. పీఆర్సీ ప్రకటన జరిగిపోయింది.