2018 ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. మేం మళ్లీ గెలవగానే కోర్టులో కేసులు గెలవడానికి ప్రయత్నిస్తాం లేకపోతే.. వేరే స్థలం కేటాయిస్తామనికేసీఆర్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు అంతా జై కేసీఆర్ అన్నారు. అంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు చెప్పారు. కానీ కేసీఆర్ చెబితే నమ్మాల్సిందే కాబట్టి మరోసారి నమ్మారు. ఎప్పట్లాగే ఎన్నికల తర్వాత పట్టించుకోలేదు.
ఆ తర్వాత మరోసారి జర్నలిస్టుల అవసరం పడినప్పుడు .. ఇదిగో స్థలం ఇచ్చేస్తున్నా.. ఫలానా స్థలం ఉంది చూసి రండి అని జర్నలిస్టు సంఘం నేతల్ని పంపారు. హమ్మయ్య కేసీఆర్ ఇచ్చేస్తున్నారని జర్నలిస్టు సంఘం నేతలు వెళ్లి స్థలం చూసి వచ్చారు. మళ్లీ మామూలే. పనైపోయిన తర్వాత పట్టించుకోలేదు. ఇటీవల సుప్రీంకోర్టులో ఉన్న వివాదాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం క్లియర్ చేసింది. కానీఇంత కాలం కోర్టు కేసుఅడ్డుగా చెప్పిన కేసీఆర్ సర్కార్ కాలు కదపడం లేదు.
మధ్యలో కేటీఆర్ కూడా తాను జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్నీ మర్చిపోయారు. జర్నలిస్టులకు వైఎస్ హయాంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.అప్పట్లో అవి ఊరికి దూరంగా ఉన్నయి. ఇప్పుడు అత్యంత విలువైన స్థలాలు. వాటిలో కొన్ని టీఆర్ఎస్ నేతల కబ్జాల్లో ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. కారణం ఏదైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఇచ్చిన మాటల్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
వాళ్లంతా సీనియర్ జర్నలిస్టులు. దాదాపుగా ఇరవై ఏళ్లకిందటే తలా రెండు లక్షలు చొప్పున కట్టి.. స్థలాలు వస్తాయని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారిలో కొంత మంది చనిపోయారు కూడా. ఇప్పుడు ప్రభుత్వం కనికరం చూపించకపోవడంతో ధర్నాలు చేసుకోవాల్సి వస్తోంది. కేసీఆర్ వంచన ఈ స్థాయిలోఉంటుందని ఊహించలేకపోతున్నామని ఆ జర్నలిస్టులు వాపోతున్నారు.