ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో ఉపఎన్నిక గండం వచ్చి పడింది. ఇప్పటికే దుబ్బాక… గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలడంతో ఈ సారి సాగర్ ఆయనకు మరింత టెన్షన్ తీసుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ నిజానికి సాగర్‌లో బలంగా లేదు. ఒక్క సారే గెలిచింది. అక్కడ బలమైన నేతగా జానారెడ్డి ఉన్నారు. ఆయనను బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేసీఆర్.. ముందస్తు కసరత్తు ప్రారంభించేశారు. నాగార్జునసాగర్‌కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో డిగ్రీ కాలేజీ పెడతామని చాలా కాలంగా టీఆర్ఎస్ హామీ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాగర్ ఎగువన ఉన్న నెల్లికల్ ఎత్తిపోతల పథకానికీ అనుమతినిచ్చారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం రూ.229.25 కోట్లతో నిర్మాణం చేస్తారు. అలాగే చిన్న చిన్న పనులకు సంబంధించిన జీవోలను కూడావిడుదల చేశారు. ఈ ప్రాజెక్టులు, పథకాలన్నీ కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవే. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా అక్కడి నేతలు.. గ్రామ గ్రామన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
అయితే.. ఈ జీవోలన్నీ… ఎన్నికలు జరిగేలోపు నిధులుగా మారి.. పనులు జరిగితేనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. లేకపోతే… ఎన్నికల్లో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే.. ఉపఎన్నికల్లో గెలిచిన హుజూర్ నగర్‌కు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించారు.కానీ వాటికి సంబంధించి.. ఏమైనా నిధులు వచ్చాయా లేదా అన్నదానిపై స్పష్టతే లేదు.